ELECTRICITY BILL: కరెంట్ బిల్లు కట్టమన్నందుకు సిబ్బందిపై బాక్సర్ పిడిగుద్దులు

by Prasad Jukanti |   ( Updated:2024-07-19 09:00:57.0  )
ELECTRICITY BILL: కరెంట్ బిల్లు కట్టమన్నందుకు సిబ్బందిపై బాక్సర్ పిడిగుద్దులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:కరెంట్ బిల్లు చెల్లించమని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిని దారుణంగా కొట్టాడో యువకుడు. తనకు వచ్చిన కిక్ బాక్సింగ్ పంచులతో రక్తం వచ్చేలా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సనన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతినగర్ లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ లైన్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న హెచ్ శ్రీకాంత్, మీటర్ రీడర్ సాయి గణేశ్ మోతీనగర్ ప్రాంతంలో మీటర్ రీడింగ్ కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ఇంటి వ్వద్దకు వెళ్లి కరెంట్ బిల్లు రూ.9,858 బకాయి ఉందని, వాటిని చెల్లించాలని చెప్పారు. అందుకు ఇంటి యజమాని కుమారుడు (కిక్ బాక్సర్) బిల్లు చెల్లించబోమని దురుసుగా ప్రవర్తించారు. దీంతో విద్యుత్ సిబ్బంది ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి లోనైనా సదరు యువకుడు మీటర్ రీడర్ సాయి గణేశ్ పై పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టాడు. అడ్డుకోబోయిన శ్రీకాంత్ పై కూడా దాడి చేశాడు. వెంటనే స్థానికులు అడ్డుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ దాడి ఘటనను విద్యుత్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. సిబ్బందిపై దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story