స్టెరాయిడ్లతో సిక్స్ ప్యాక్! యువత ప్రాణాలతో జిమ్ యాజమాన్యాల చెలగాటం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-25 01:51:02.0  )
స్టెరాయిడ్లతో సిక్స్ ప్యాక్! యువత ప్రాణాలతో జిమ్ యాజమాన్యాల చెలగాటం
X

సిక్స్ ప్యాక్‌పై మోజున్న యూతే వారి టార్గెట్. జిమ్‌లకు వచ్చే వారిని లైన్‌లోకి దింపుతారు. ఆరు నెలల్లో మీ కలను నెరవేరుస్తామంటూ నమ్మబలుకుతారు. క్రమంగా స్టెరాయిడ్లు, ప్రొటీన్ పౌడర్లను అలవాటు చేస్తారు. నగరంలోని పలు జిమ్‌లలో సాగుతున్న ఈ దందాతో యువత ఆరోగ్యం దెబ్బతింటున్నది. చావుకు దగ్గరవుతున్నది. ఇటీవల పోలీసులు పెద్ద ఎత్తున స్టెరాయిడ్ ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రస్తుతం యువకుల్లో సిక్స్ ప్యాక్ మోజు ఎక్కువైంది. సినీ హీరోలను చూస్తూ వారిలానే తమ శరీరాకృతిని మార్చుకోవటానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్‌లలో చేరుతున్నారు. అయితే చాలా జిమ్‌లలో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. దీనికి తోడు సిక్స్ ప్యాక్‌పై మోజున్న యూత్‌ను టార్గెట్ చేసుకొని స్టెరాయిడ్‌లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అన్ ట్రెయిన్డ్ శిక్షకులు

కొన్ని జిమ్‌ల యాజమాన్యాలు నామమాత్రపు జీతాలకు అన్ట్రెయిన్డ్ శిక్షకులను నియమించుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. జిమ్‌లో చేరుతున్న వారికి మొదట ఈసీజీ, ఈకో, ట్రేడ్ మిల్ టెస్టులు జరిపించుకుని రావాలని యాజమాన్యాలు చెప్పాలి. ఈ రిపోర్టులు చూశాక వారితో ఎలా? రోజుకు ఎంతసేపు కసరత్తులు జరిపించాలన్న దానిపై ట్రైనర్లకు ఓ అవగాహన వస్తుంది. అయితే, శిక్షణ పొందిన వారిని ట్రైనర్లుగా పెట్టుకుంటే రూ. 40 వేల నుంచి రూ. 50వేల రూపాయల వరకు జీతాలు చెల్లించాల్సి వస్తుందని అధికశాతం జిమ్‌ల యాజమాన్యాలు తమ వద్దనే ఎక్సర్ సైజులు చేస్తూ వస్తున్న సీనియర్లకే ట్రెయినింగ్ బాధ్యతలను అప్పగిస్తున్నాయి.

సరైన అనుభవం లేని వీళ్లు కొత్తగా చేరుతున్న వారికి శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కొత్తగా చేరిన వారితో ఎంతసేపు కసరత్తులు జరిపించాలి, ఏ తరహా ఎక్సర్సైజులు చేయించాలి అన్న అంశాలపై వీరికి అవగాహన ఉండడం లేదు. మరోవైపు కొత్తగా కసరత్తులు మొదలుపెట్టిన వారు రెండు మూడు నెలల్లోనే బాడీ డెవలప్ చేయాలనుకుంటూ ఇష్టానుసారంగా కసరత్తులు చేస్తుండడంతో కొందరు గుండెపోట్లకు గురై చనిపోతున్నారు.

స్టెరాయిడ్ ఇంజక్షన్లు, మాత్రలు

కొన్ని జిమ్‌ల యాజమాన్యాలు తాము చెప్పినట్టు చేస్తే ఆరు నెలల్లో సిక్స్ ప్యాక్ గ్యారంటీ అని చెబుతూ ఫిట్ నెస్ కోసం వస్తున్న వారికి స్టెరాయిడ్లు అలవాటు చేస్తున్నాయి. క్రమంగా వారిని చావు వైపు నెడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఓ జిమ్ ట్రైనర్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి డ్యూరాడెక్స్–250, స్టార్మ్ బియర్10ఎంజీ, ఎయిర్ స్లెన్ 40ఎంజీ, డెబొలాన్ 40ఎంజీ ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీలైనంత త్వరగా సిక్స్ ప్యాక్ కావాలనుకునే వారికి ఈ ఇంజక్షన్లు, మాత్రలు ఇస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.

ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా వైద్యులు బలహీనమైన టెస్టిక్యులర్ ఫంక్షన్ చికిత్స కోసం, కండరాల ట్రీట్ మెంట్ లో భాగంగా స్టెరాయిడ్స్‌ను రోగులకు ఇస్తారు. నిబంధనల ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఏ స్టెరాయిడ్‌ను కూడా మెడికల్ హాళ్ల యజమానులు విక్రయించరాదు. అయితే, కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు ఎలాంటి ప్రిస్క్రిప్షన్లు లేకుండానే వీటిని అమ్ముతున్నారు. ఈ స్టెరాయిడ్స్‌ను తీసుకుంటున్న యువతీ, యువకులు కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. దాంతోపాటు గుండెకు సంబంధించిన రుగ్మతల బారిన పడుతున్నారు.

ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి

- డాక్టర్ విజయ్, జనరల్ ఫిజీషియన్

స్టెరాయిడ్లను ఎలా పడితే అలా వాడితే చావు తప్పదు. చాలామంది యువకులు సిక్స్ ప్యాక్ కోసం వీటికి బానిసలవుతున్నారు. ప్రొటీన్లు కూడా ఆరోగ్యాలను దెబ్బ తీస్తున్నాయి. చాప కింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారానికి చెక్ పెట్టటానికి పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Advertisement

Next Story