‘లీకేజీలకు పాల్పడిన నేరస్థులతోనే మళ్ళీ గ్రూప్స్ పరీక్షలా?’

by Sathputhe Rajesh |
‘లీకేజీలకు పాల్పడిన నేరస్థులతోనే మళ్ళీ గ్రూప్స్ పరీక్షలా?’
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీలకు పాల్పడిన నేరస్థులతోనే మళ్ళీ గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తే ఎలా? అని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్ముర్ వెంకట్ నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని బోర్డుల పేపర్లు లీక్ చేసిందని ఆరోపించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వ తప్పుని కప్పి పుచ్చుతున్నారని, పేపర్ స్కాం పై సీబీఐ విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకి వస్తాయని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా సర్కార్ పరీక్షలు సరిగ్గా చేపట్టడం లేదని మండిపడ్డారు.

మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలోనే కాదు మిగతా బోర్డులల్లో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డీఈ రమేష్ ప్రమేయం ఉందని చెబుతున్న సిట్ అధికారులు.. రమేష్ పేపర్ లీక్ చేసింది టీఎస్పీఎస్సీ‌లోనా లేదా ఎస్పీడీసీఎల్‌లోనా స్పష్టం చేయాలన్నారు. అందులో రమేష్ లీక్ చేసిన పేపర్ ఏంటో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఈ రమేష్ అక్రమాలు బయటపడడంతో ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపట్టిన జూనియర్ లైన్ మెన్‌ల రిజల్ట్ బయట పెట్టారని అన్నారు.

ఎస్పీడీసీఎల్‌లో అవకతవకలు బయటపడతాయని, రమేశ్‌ను టీఎస్పీఎస్సీకే పరిమితం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడానికే బోర్డులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఎస్పీడీసీఎల్ బోర్డు పరిధిలో గత సంవత్సరం ఆగస్టు 26న జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని పోరాటం చేస్తే దాన్ని రద్దు చేశారని, మళ్ళీ ఫిబ్రవరి 2న జూనియర్ లైన్ మెన్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో మాస్ కాపీయింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 162 మందికి 40కిపైగా మార్కులు రాగా, ఒక్క ఆ సెంటర్ లోనే 92 మందికి 40కి పైగా మార్కులు వచ్చాయన్నారు. అక్రమాలు బయటపడకుండా ఓటీపీ సిస్టమ్ తీసుకొచ్చారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed