మోడల్‌ కూరగాయల మార్కెట్లో గదులకు కొరత

by Sathputhe Rajesh |
మోడల్‌ కూరగాయల మార్కెట్లో గదులకు కొరత
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : అంచనాలు తలకిందులయ్యాయా? ప్రణాళికలు బెడిసికొట్టాయా? ప్లాన్‌ పక్కదారి పట్టిందా? కారణమేంటో గాని వరంగల్‌ లక్ష్మీపురంలోని మోడల్‌ కూరగాయల మార్కెట్‌ను స్థలాభావం వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. రూ.7కోట్లు పెట్టి అట్టహాసంగా నిర్మించిన మార్కెట్‌లో షాపుల కేటాయింపు ఆద్యంతం విస్తుగొల్పుతోంది. మార్కెట్లో వ్యాపారస్తులకు, చేపట్టిన నిర్మాణాలకు పొంతన లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్కెట్‌ ప్రారంభించి ఏడాది దాటినా ఇంకా అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.

వాస్తవానికి పాత మార్కెట్‌లో గతంలో 91 మంది కమీషన్‌ అండ్‌ అడ్తీ వ్యాపారులు ఉన్నట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే అంచనాలు సిద్ధం చేసి మోడల్‌ మార్కెట్‌లో చేపట్టాల్సి ఉండగా, ప్లాన్‌ ఎక్కడ ఎలా బెడిసికొట్టిందో 82 గదులే నిర్మించడం గమనార్హం. వీటితోపాటు రిటైల్‌ వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్డు కూడా నిర్మాణం చేపట్టారు. వీటికి మొత్తంగా రూ.6.25కోట్లు వెచ్చించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా తక్కువగా నిర్మించిన గదులకు గాను మరో రూ.75లక్షలు ఖర్చు చేసి అదనంగా మరో 14 గదులు నిర్మించారు.

అయితే, అసలు అనుమానాలు ఇక్కడే మొదలయ్యాయి. వాస్తవానికి పాత మార్కెట్లో లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు 91మంది మాత్రమే. తొలుత 82 గదులు కట్టగా మరో 9 గదులే అవసరం ఉంది. మరి అధికారులు ఎందుకనో, ఎవరి కోసమనో 5 గదులు అదనంగా నిర్మించారు. ఈ విషయమై ఇప్పటికీ మార్కెట్‌ అధికారులకు, కొందరు వ్యాపారులకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు ఏం జరిగిందంటే..?

లెక్క ప్రకారం 91 మందికి లైసెన్స్‌లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, మార్కెట్‌ నిర్మాణం పూర్తయిందో లేదో ఉన్నఫలంగా మార్కెట్‌ అధికారులు ఐదుగురికి కొత్తగా లైసెన్స్‌లు 2022లో జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఐదుగురిలో ఒకరు డైరెక్టర్‌, మరో ఇద్దరు కార్పొరేటర్లు, మరొకరు మాజీ కార్పొరేటర్‌, మరొకరు మార్కెట్‌ మాజీ అధ్యక్షుడు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురిలో ఒకరిద్దరికి అసలు వ్యాపారులను పక్కన పెట్టి మరీ గదులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌కు ఆదాయం వస్తుందనో, లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనో 91 గదుల నుంచి మొత్తం 96గదులకు మార్కెట్‌ నిర్మాణం చేరుకుంది.

అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మార్కెట్‌ భవనం పైకి వెళ్లడానికి ఐదు చోట్ల మెట్లు నిర్మించారు. ఇప్పుడు ఆ మెట్ల కింది ఖాళీ స్థలం కూడా గదులుగా మార్చి వ్యాపారులకు కేటాయించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐదుగురు ఎక్కడి వారు? వీరికి లైసెన్స్‌లు ఎక్కడివి? అసలు లైసెన్స్‌లు ఉన్నాయా? ఉంటే అన్ని షాపులకు ఉన్నట్లుగా వీరి షాపులకు ఎందుకు నంబర్లు లేవు? అసలు వీళ్లు పాత మార్కెట్‌కు చెందిన వారా? లేదంటే అధికారులు కొత్తగా లైసెన్స్‌లు జారీ చేశారా? ఒకవేళ పాతవారే అయ్యుంటే వీరికి గదులు ఎందుకు దక్కలేదు?

అదీగాక, కొత్తగా కట్టిన 14 గదుల కంటే ముందుగానే వీరికి మెట్లు కేటాయించడానికి కారణాలు ఏంటీ? అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ప్రధానంగా మార్కెట్‌ ఆఫీసు కోసం కేటాయించుకున్న మెట్ల స్థలాన్ని సైతం ఇటీవల ఒకరికి వ్యాపార నిమిత్తం అప్పగించగా ఏకంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లాంఛనంగా ప్రారంభించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, గతంలోనే ఓ డైరెక్టర్‌కు ఆఫీసు గదిని దారాదత్తం చేసినట్లు ఆరోపణలు ఉండగా తాజాగా ఈ మెట్ల స్థలాన్ని మరో డైరెక్టర్‌కు అప్పగించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం.

మరిన్ని గదులు నిర్మించే యోచన..

ఇప్పటికే అంతుచిక్కని రహస్యంగా మారిన మోడల్‌ మార్కెట్‌లో మరిన్ని గదులు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌ యార్డులో మూత్రశాలలు ఏర్పాటు చేసిన పాత భవనాన్ని కూల్చివేసి అక్కడ కొత్తగా గదులు నిర్మించాలనే యోచనలో మార్కెట్‌ యంత్రాంగం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అక్కడ నిర్మించే గదులు మెట్ల కింద వ్యాపారులకు కేటాయిస్తారా? లేదంటే.. మరింతమందికి కొత్త లైసెన్స్‌లు జారీ చేసి మార్కెట్‌ను మరింత మోడల్‌ మార్కెట్‌గా తీర్చిదిద్దుతారా? మార్కెట్‌లో గదుల కేటాయింపులో నెలకొన్న గందరగోళానికి తెరదించుతారా? వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed