గడీ బయటి దొంగలు సరే.. గడీ లోపలి అసలు దొంగలు దొరకడం లేదా..?

by Mahesh |   ( Updated:2023-05-30 08:25:43.0  )
గడీ బయటి దొంగలు సరే.. గడీ లోపలి అసలు దొంగలు దొరకడం లేదా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొలువుల కోసం నిరుద్యోగులు కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే అదే నిరుద్యోగుల నోట్ల కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సర్వర్లు, హ్యాకింగ్, క్వశ్చన్ పేపర్ల సేలింగ్, హైటెక్ మాస్ కాపియింగ్.. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో సాగిన టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహాకమిదేనని ధ్వజమెత్తారు. టీఎస్ పీఎస్సీలో హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించిన నేపథ్యంలో షర్మిల తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎగ్జామ్ హాల్‌లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్ లు, ఇయర్ బడ్స్ తీసుకు వెళ్తుంటే సెంటర్ల వద్ద పోలీసులు, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? అని నిలదీశారు. కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇదంతా సాధ్యం అయిందా అన్నారు.

చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే కేసీఆర్, టీఎస్ పీఎస్సీ బోర్డు సిగ్గుతో తలదించుకోవాలి కదా, బోర్డు ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం అవినీతి పాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి కదా అని అన్నారు. టీఎస్ పీఎస్సీ బోర్డు అవినీతి, అక్రమాలు గ్రామాలను దాడి ఖండాలు దాటిన ప్రభుత్వం నుంచి చర్యలు లేవని దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లుగా పాత బోర్డుతోనే మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిట్ అధికారులకు గడి బయట ఉన్న దొంగలు దొరుకుతున్నారు. కానీ గడి లోపల ఉన్న అసలు దొంగలు దొరకడం లేదా అని నిలదీశారు. నిరుద్యోగుల భవిష్యత్ అందకారంలో పడకుండా ఈ విషయంలో గవర్నర్ తమిళిసై స్పందించాలన్నారు. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించి టీఎస్ పీఎస్సీ బోర్డును పునరుద్దరించేలా రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed