సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు

by Nagaya |   ( Updated:2022-09-09 05:00:07.0  )
సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు
X

గురువారం రాత్రి వరకు జీతాలు జమ కానీ జిల్లాలు : మహబూబ్​నగర్, వికారాబాద్, హన్మకొండ, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, నారాయణపేట, మెదక్,​

ఆదిలాబాద్, నాగర్​ కర్నూల్, పెద్దపల్లి జిల్లాల్లో కాలేదు.

గురువారం సాయంత్రం జమ అయిన జిల్లాలు: వరంగల్, సూర్యాపేట, కామారెడ్డి (కొన్ని ఎస్టీఓలు మాత్రమే) జిల్లాల్లో జమ అయ్యాయి.


దిశ, తెలంగాణ బ్యూరో : జీతాల కోసం ప్రతినెలా ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని అధికారులు చెప్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు ఆలస్యమవుతూనే ఉన్నాయి. గతంలో జిల్లాల వారీగా జీతాలిచ్చినా.. గత నెల నుంచి ఎస్టీఓల వారీగా చెల్లింపులు మొదలుపెట్టారు. అయినప్పటికీ 11 జిల్లాల పరిధిలోని ఎస్టీఓల్లో ఒక్క శాఖకు కూడా జమ చేయలేదు. కొన్ని జిల్లాల్లో ఒకటీ, రెండు ఎస్టీఓల పరిధికి చెక్కులిచ్చారు. దీంతో గురువారం రాత్రి వరకు కొన్ని జిల్లాల్లో కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి.

ఖర్చుల కాలం

రాష్ట్రంలో పండుగల వాతావరణం నెలకొంది. ఇప్పుడైనా మొదటి వారంలోనే జీతాలు పడుతాయని ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, శాలరీ క్రెడిట్​మెస్సేజ్‌ లు రావడం లేదు. ప్రస్తుతం ఖర్చులున్నాయని, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని ఉద్యోగులు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలకు మొర పెట్టుకుంటున్నారు.

డీఏ వచ్చినట్టా.. రానట్టా..?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా రెండు నెలల డీఏ పెండింగ్​ఉంది. అయితే, 2021, జూలైకి సంబంధించిన డీఏను విడుదల చేస్తున్నట్లు కేబినెట్​నిర్ణయం తీసుకుందని తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, డీఏ విడుదలపై ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేదు. జీవో కూడా జారీ కాలేదు. దీంతో ఈ నెల వేతనాల్లో డీఏ కలువనట్టేనని తేలిపోయింది.

కొన్ని జిల్లాల్లో కొన్ని శాఖలకే

రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఒక్కరికీ కూడా గురువారం రాత్రి వరకు వేతనాలు రాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని హెచ్ఓడీ విభాగాలకు మాత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు జిల్లాల్లో కొన్ని శాఖలకు ఎస్టీఓల నుంచి చెక్కులు జమ చేశారు. దీంతో ఒక్కో జిల్లాలోని ఒకటీ, రెండో ఎస్టీఓల పరిధిలో మాత్రమే కొంతమందికి వచ్చాయి. అంతేకానీ మొత్తం జిల్లాలోని ఉద్యోగులకు జీతం చేతికందలేదు. ప్రస్తుతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఇటీవల 10 లక్షల కొత్త ఆసరా పెన్షన్లు కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, మంజూరు కార్డులను జారీ చేస్తున్నారు. వీరికి కూడా ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయాలి.

పెన్షనర్లకు లేవు

కాగా, ప్రభుత్వ పెన్షనర్లకు ఇంకా అసలే పింఛన్లు విడుదల కాలేదు. రెండున్నర లక్షల మంది పెన్షన్​దారులు తమ పింఛన్​కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. తాజాగా రిటైర్డ్​గెజిటెడ్​ అధికారులు సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపించారు. ప్రతినెలా 1వ తేదీనాడే పెన్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీఏలు కూడా ఇవ్వాలని విన్నవించారు. ప్రస్తుతం ఇంకా పెన్షన్లు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్తున్నారు.

Also Read : 'కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం'

Also Read : మునుగోడుపై నర్సుల నజర్.. టీఆర్ఎస్‌కు షాకిచ్చేలా పక్కా ప్లాన్!

Advertisement

Next Story