MGBSలో న్యూ ఇయర్ వేడుకలు.. ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన

by GSrikanth |
MGBSలో న్యూ ఇయర్ వేడుకలు.. ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి ఆయన కేక్ కటింగ్ చేసి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఎంజీబీఎస్‌లోకి వెళ్లి ప్రయాణికులతో ముచ్చటించారు. బెంగళూరు, కోదాడకు వెళ్తున్న బస్సుల్లో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. ప్రయాణికులకు గులాబీలు అందించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం ప్రయాణికులు సంస్థను బాగా ఆదరించారని గుర్తుచేస్తూ.. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల ఆదరాభిమానాలు సంస్థపై ఉండాలని కోరారు. ఈ కొత్త ఏడాదిలో సంస్థకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం విజయవంతంగా అమలవుతోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు దాదాపు 6.60 కోట్లకు పైగా మహిళలను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. ఈ స్కీం ప్రకటించిన 48 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామని, సిబ్బంది సహకారం వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణకు నిదర్శనమనే విషయాన్ని మహాలక్ష్మీ స్కీం అమలుతో మరో సారి నిరూపించారని అన్నారు. మహాలక్ష్మి స్కీంను ప్రశాంతంగా అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంస్థను అభినందించారని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

Advertisement

Next Story