- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదివాసీ మహిళగా ఎన్నో కష్టాలు పడ్డా! దళిత ప్రగతి సదస్సులో సీతక్క కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజం లోతుగా చొచ్చుకొని ఉన్న వ్యవస్థీకృత అణచివేతపైన పోరాడాల్సిన సమయం వచ్చిందని మంత్రి సీతక్క (Minister Seethakka) పిలుపునిచ్చారు. కేరళ (Kerala) రాజధాని తిరువంతపురంలో తాజాగా (Dalit Progress Conference) దళిత ప్రగతి సదస్సు ప్రారంభమైంది. ఈ దళిత ప్రగతి సదస్సును కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం సదస్సుకు హాజరైన మంత్రి సీతక్క ప్రసంగిస్తూ.. నమస్కారం కేరళ.. ఈ రోజు మీ ముందు నిలబడి, అణగారిన, బలహీన వర్గాల వాణీ వినిపించడానికి గర్విస్తున్నాను.. అని చెప్పారు. ఒక ఆదివాసీ మహిళగా మా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలు, అన్యాయాలను ప్రత్యక్ష్యంగా ఎదుర్కొన్న నేను, ఈ రోజు మీ ముందు అధికారానికి ఉదాహరణగా నిలబడ్డాను.. అని తెలిపారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నేడు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా, స్త్రీ సంక్షేమం మంత్రిగా ఉన్నాను.. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను.. అని వివరించారు.
దళితుల హక్కుల కోసం మాట్లాడుతున్న ఈ సమయంలో, మన పోరాటాలు సమానత్వం, సామాజిక న్యాయం మాత్రమే ఉండకూడదన్నారు. అణచివేత పైన పోరాడాల్సిన సమయం వచ్చిందని, అదే సమయంలో మనం సాధించిన విజయాల్ని సంబరంగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఆ విజయాలు ఎంత చిన్నవి అయినా సంబరంగా జరుపుకోవాలని, ఎందుకంటే అమరుల త్యాగాలను, వారు సాధించిన విజయాల్ని స్మరించాల్సిన అవసరం ఉందన్నారు. అయ్యంగర్ పోరాటం మొదలు నంగేలీ వరకు ఎన్నో పోరాటాలు చేశారని, వారు భావి తరాల బాగు కోసం పని చేశారని గుర్తుకు చేశారు. ఈ దేశ దళిత ఆదివాసులుగా, మనకి ఒక గొప్ప ప్రతిఘటన, విప్లవ చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ మొదలు నేటికి మార్పు కోసం చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలు అందులో భాగమేనని చెప్పుకొచ్చారు. ఈ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి పొంది, సమసమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి చరిత్రలో, దళితులుగా మనం ఎన్నో చీకటి రోజుల్ని చూశాం.. కానీ, ప్రతీసారి ఎదురొడ్డి నిలబడ్డామన్నారు. పోరాట పటిమను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భావి తరాలకు మంచి భవిష్యత్ కోసం పాటుపడదామని మంత్రి పిలుపునిచ్చారు.