రైతుబంధు అక్రమార్కులపై ఆర్ఆర్ యాక్ట్.. తిరిగి వసూలు చేసేందుకు చర్యలు

by Shiva |
రైతుబంధు అక్రమార్కులపై ఆర్ఆర్ యాక్ట్.. తిరిగి వసూలు చేసేందుకు చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధు అక్రమంగా పొందిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. అదే కార్యరూపం దాల్చితే రూ.వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లకు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. ప్రతి గ్రామంలోనూ రైతాంగం అదే కోరుతున్నది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికే సాయం అందించాలని కోరుతున్నది. ఐతే గడిచిన ఐదేండ్లుగా వేలాది మంది అక్రమార్కులు రైతుబంధు పథకం కింద రూ.లక్షలు పొందారు. నాకు రైతుబంధు కింద రూ.కోట్లు వస్తున్నాయంటూ గొప్పగా చెప్పిన నాయకులు ఉన్నారు.

40 ఏళ్ల క్రితమే ప్లాట్లు చేసిన అమ్మేసిన భూములకు దొడ్డి దారిన పాసు పుస్తకాలు పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి సంఖ్య వేలల్లోనే ఉన్నది. ఒక్కొక్కరి ఖాతాల్లో ఈ ఐదేండ్ల కాలంలో రూ.లక్షల్లో జమ అయ్యాయి. పెట్టుబడి సాయం కింద అందించే పథకాన్ని ఉద్ధేశ్వపూర్వకంగానే లబ్ధి పొందారు. ఈ జాబితాలో ప్రధానంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందు వరుసలో ఉంటారు. కలెక్టర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఐదేండ్ల సొమ్మును వసూలు చేసే అవకాశం ఉంది. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఒక్క కేసులోనే రూ.20 లక్షల వరకు రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. అదే జిల్లాలో వేలాది కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి నోటీసులు జారీ చేసి అక్రమంగా పొందిన సొమ్మును కలెక్ట్ చేస్తే రూ.వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి చేరడం ఖాయం. అధికారులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉంటుందో వేచి చూడాలి.

అక్రమార్కులకు నోటీసులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల్ పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి సర్వేనెంబర్ 38, 39 , 40 ఈ మూడు సర్వే నెంబర్లు లలో అమ్మేసిన 33 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు. గడిచిన ఐదేండ్లుగా రైతుబంధు రూ.20 లక్షలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారించిన అధికారులు చర్యలకు పూనుకున్నారు.

1981 నుంచి లేఅవుట్లుగా (శారదా నగర్) మారిన సర్వే నెం.39, 40 లోని 33 ఎకరాలకు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి రైతుబంధు కింద రూ.20 లక్షల వరకు తీసుకున్నారు. ఈ మొత్తంలో నాన్ అగ్రికల్చర్ గా మారిన ల్యాండ్ కి సంబంధించిన అమౌంట్ రూ.16.80 లక్షలను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని తహశీల్దార్ ని ఆదేశించారు. అంటే ఒక్క రైతు నుంచే ఇంత అమౌంట్ రానున్నది. అధికారులు తలచుకుంటే ఇప్పటికిప్పుడు రూ.వేల కోట్ల అక్రమంగా రైతుబంధు అమౌంట్ తీసుకున్న వారి నుంచి వసూలు చేసే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ మేరకు కలెక్టర్ లేఖ నం.డి1/1115/2024, తేదీ.29.06.2024 ద్వారా ఘట్ కేసర్ తహశీల్దార్ ని ఆదేశించారు. ఇక వసూలు చేస్తారా? యాక్షన్ తీసుకుంటారా? అన్నది అధికారుల నిజాయితీపైనే ఆధారపడి ఉంటుంది.

చర్చకు ముందు చర్యలు

రాష్ట్రంలో వేలాది మంది రైతులు అమ్మేసిన భూములకి కింది స్థాయిలో ఉన్న అధికారులని ప్రలోభాలకు గురిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొడుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి సూచిస్తున్నారు. సదరు అధికారులపైనా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలు పునరావృతం కావన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల ఆడంబారాలు, అవసరం లేని ఖర్చులతో అప్పులకుప్ప పెద్దదైంది. ఇప్పుడేమో రైతాంగానికి సాయమందించే రైతుబంధు వంటి పథకానికి కూడా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఐతే ఎవరికి సాయం కావాలి? ఎవరిని అనర్హులుగా ప్రకటించాలి? అన్న అంశంపై పెద్ద చర్చ నడుస్తున్నది. దానికి ముందే ఈ ఐదేండ్లలో అక్రమంగా ప్రభుత్వ సొమ్మును పొందిన వారిపై యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా చర్యలు చేపడితే రూ.వేల కోట్లు వస్తాయంటున్నారు. ధరణి పోర్టల్ సృష్టించిన మాయాజాలంతో 40 ఏండ్ల క్రితం వెంచర్లుగా, ప్లాట్లుగా అమ్మేసినవి కూడా వ్యవసాయ భూములుగా రికార్డుల్లోకి ఎక్కాయి. పాత పట్టాదారుల పేరిట కొత్త పాసు పుస్తకాలు అందాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే ఇల్లీగల్ లేదా పంచాయతీ అనుమతితో లే అవుట్లు చేసి అమ్మేసిన విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉన్నది.

అయితే, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వారందరికీ రైతుబంధు ఇవ్వడం ద్వారా రూ.వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. అనర్హులకు అందాయి. ఈ విషయం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, డీటీసీపీ, హెచ్ఎండీఏ, పురపాలక, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల అధికారులకు తెలుసు. ఆ భూములు ఏనాడో నివాస ప్రాంతాలుగా మారాయని, కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూడా నిర్మించారని తెలుసు. కానీ ఐదేండ్ల కాలంలో సాయం అందిస్తూనే ఉన్నారు. ఇదేం ఫీల్డ్ మీదికి వెళ్లి టేపులు పట్టి కొలిచేది కూడా కాదు. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎన్కబంరెన్స్ సర్టిఫికేట్ల డేటా సరిపోలిస్తే సరిపోతుంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్ జిలాల్లోనే అధికంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed