పర్యాటకాభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకం : కిషన్ రెడ్డి

by Vinod kumar |
పర్యాటకాభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకం : కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగ అభివృద్ధిలో సినిమాలు పోషించే పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సినిమాల్లో చూపించే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు పర్యాటకులను ఆకర్శిస్తాయని ఆయన అన్నారు. కశ్మీర్ ప్రకృతి అందాలను చూపించే చిత్రాల ద్వారా ఇక్కడి పర్యాటకం పెరిగిన సందర్భాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారు. సోమవారం కశ్మీర్‌లోని శ్రీనగర్ లో రెండ్రోజులపాటు జరగనున్న జీ20 సమావేశాలను పురస్కరించుకుని సైడ్ ఈవెంట్ గా ‘ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్’ థీమ్ పై నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో పర్యాటక రంగంలో సినిమాల పాత్రకు సంబంధించిన పాలసీలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి తదితర అంశాలకు ఇదొక చక్కని వేదికన్నారు.భూతల స్వర్గమైన శ్రీనగర్ ప్రకృతి రమణీయత గురించి ప్రాచీన కాలం నుంచి ఎంతో గొప్పగా వివరించేవారని, అలాంటి కశ్మీర్‌లో సినిమాలు తీసేందుకు గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్లు ఆసక్తి చూపించేవారన్నారు. కశ్మీర్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లోని అద్భుతమైన సందర్శనీయ స్థలాల్లో తరచుగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయన్నారు. భారతదేశంలో ప్రకృతి వైవిధ్యత కారణంగా ఇక్కడ సినిమాల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు.

‘అతిథి దేవో భవ’ నినాదంతో ముందుకెళ్తున్న భారతదేశంలో ఆతిథ్య రంగం, రవాణా, మారుమూల ప్రాంతాలకు కూడా పెరుగుతున్న అనుసంధానత వంటివి ఫిల్మ్ మేకర్స్ కు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ తమ పర్యాటక రంగాభివృద్ధిలో సినిమాల పాత్రను గుర్తించి ప్రోత్సహిస్తున్నాయని గుర్తుచేశారు. దీని ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు ఉపాధి కల్పన కూడా పెరుగుతుందన్నారు. అనంతరం, వివిధ దేశాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఫిల్మ్ షూటింగ్స్ ను ప్రోత్సహిస్తున్న పాలసీలు, ఉత్తమ పద్దతులను ఆయా దేశాల ప్రతినిధులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కోఆర్డినేటర్ హర్షవర్ధన్, పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, జీ20 దేశాల ప్రతినిధులు, ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ, ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story