‘బట్టతల మీద జుట్టు మొలిపిస్తా’.. భారీ దందాకు తెరలేపిన ఆర్ఎంపీ..!

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-26 02:59:45.0  )
‘బట్టతల మీద జుట్టు మొలిపిస్తా’.. భారీ దందాకు తెరలేపిన ఆర్ఎంపీ..!
X

చిన్న వయసులో వెంట్రుకలు ఊడిపోతే.. పెళ్లికాకముందే బట్టతల వచ్చేస్తే ఎవరైనా సరే అందుకు అనుగుణంగా మంచి డాక్టర్ ఎవరో తెలుసుకుని అనుభవం ఉన్న డెర్మటాలజీని వెతుక్కుని ట్రీట్ మెంట్ తీసుకుంటాం. పిల్లలు పుట్టకపోతే సరైన గైనకాలజిస్టును ఎంపిక చేసుకుని వైద్యం పొందుతాం. కానీ ‘సర్వరోగ నివారిణి నేనే’ అంటూ ఓ ఆర్ఎంపీ వైద్యం చేస్తే.. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఏన్కూర్ మండల కేంద్రంలో నడిబొడ్డున గాయత్రీ ప్రాథమిక చికిత్స కేంద్రంలో కొలిశెట్టి నరేష్ అనే వ్యక్తి డాక్టర్ నని చెప్పుకుంటూ భారీ దందాకు తెరతీశాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ‘దిశ’ స్టింగ్ ఆపరేషన్లో అనేక విషయాలు బట్టబయాలయ్యాయి.

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ ఎలాంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న ఆస్పత్రుల సంఖ్య బాగా పెరిగింది. ఐదున్నరేళ్లపాటు ఎంబీబీఎస్ చదివినవారు పట్టాలందుకున్నకా.. స్పెషలిస్టుగా మరో మూడేళ్లపాటు ఎంఎస్ చేసిన తర్వాత డాక్టర్లుగా అన్ని అనుమతులు తీసుకుని ట్రీట్ మెంట్ చేయడం చూస్తుంటాం. కానీ ప్రాథమిక చికిత్స కేంద్రం నడిపే ఓ ఆర్ఎంపీ వైద్యుడే అర్హుడైన డాక్టర్ లా చెలామణి కావడం విస్మయం గొలుపుతుంది. ఏన్కూర్ మండల కేంద్రంలో నడిబొడ్డున గాయత్రీ ప్రాథమిక చికిత్స కేంద్రం పేరిట కొలిశెట్టి నరేష్ అనే ఓ ఆర్ఎంపీ చేస్తున్న నిర్వాకం భారీ దందానే తలపిస్తుంది. దిశ చేసిన స్టింగ్ ఆపరేషన్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

ప్రిస్క్రిప్షన్ లేకుండానే వైద్యం..

ఎవరైనా డాక్టర్ లేదా ఆర్ఎంపీ వైద్యం చేస్తే మొదట ప్రిస్క్రిప్షన్ పై ఆస్పత్రి పేరు, డాక్టర్ పేరు, చదువుకున్న విద్యార్హతలు, ఏ విభాగంలో నిష్టాతుడు అనే అంశాలు పొందుపరుస్తారు. ఓ ఆర్ఎంపీ వైద్యం చేసినా ప్రాథమిక చికిత్స కేంద్రం పేరు, వైద్యం చేసే వ్యక్తి పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ తదితర విషయాలుంటాయి. తర్వాత పేషెంట్ను డాక్టర్ చూసే ముందు అక్కడ ఉండే సిస్టర్ బీపీ, పల్స్, హైట్, వెయిట్, సమస్య ఏంటో తెలుసుకుని ప్రైమరీ సమాచారాన్ని రాస్తారు. ఏన్కూర్ లో కొలిశెట్టి నరేష్ చేసే వైద్యంలో ఇవేవీ కనిపించవు. బయట ‘గాయత్రీ ప్రాథమికి చికిత్స కేంద్రం’ పేరు తప్ప.. ప్రిస్క్రిప్షన్ లో ఎక్కడ తన పేరు, ఇచ్చిన ట్రీట్ మెంట్ ఏవీ ఉండవు. కేవలం ప్యాకెట్ సైజ్ తెల్లకాగితంపై ఇతను రాసే ట్రీట్ మెంట్ ఉంటుంది. ల్యాబ్ టెస్టులు, మందులు అన్నీ అక్కడే దొరుకుతాయి.. వేలల్లో ఖర్చవుతాయి. కానీ అఫీషియల్ గా ఇతను మాత్రం దొరక్కుండా జాగ్రత్త పడుతుంటాడు. ‘దిశ’ స్టింగ్ ఆపరేషన్ సమయంలో కోదాడకు చెందిన ఓ యువతికి 16వేల రూపాయల టెస్టులు, మందులు రాయడం కొసమెరుపు.

బట్టతలమీద జుట్టు మొలిపిస్తా..

ఇక ఇతని వైద్యం మామూలుగా ఉండదు. బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానంటాడు. అన్ని చర్మ వ్యాధులకు సరైన వైద్యం ఇక్కడే దొరుకుతుందంటాడు. పిల్లలు పుట్టని వారికి కూడా ట్రీట్ మెంట్ చేస్తానంటాడు. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులన్నింటినీ అంతం చేస్తానని శపథం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రీ ప్రాథమికి చికిత్స కేంద్రం.. సర్వ రోగ నివారిణిగా భావించాలని అక్కడి వచ్చే పేషంట్లతో చెప్పడం కొసమెరుపు. ఏ వ్యాధికైనా, ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం కావాలంటే తను అందించే చికిత్స మాత్రమే నని ధీమా చెబుతాడు. దీంతో అక్కడివచ్చే పేషెంట్లు అందరూ నిజమేనని నమ్మి వేలుపోసి నకిలీ వైద్యం అందుకుంటున్నారు. అసలైన డాక్టర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా బిల్డప్పులు ఇస్తూ ఏడెనిమిదేళ్లు చదివి వైద్యం చేసే అసలైన డాక్టర్ లాగా సమాంతర వ్యవస్థనే నడపడం గమనార్హం. ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని వారే పేషంట్లలాగా.. వారే చికిత్స పొంది క్యూర్ అయినవారిలాగా.. వారే సోషల్ మీడియాలో ప్రచారకర్తలుగా హంగామా చేయడం నకిలీ నరేష్ కే సొంతం.

సోషల్ మీడియాలో విపరీత ప్రచారం..

అసలు సిసలైన డాక్టర్ అవతారం ఎత్తడం.. సర్వరోగ నివారిణిలాగా అన్ని వైద్యాలకు ట్రీట్ మెంట్ చేయడం ఒక ఎత్తైతే.. దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం.. జనాల దగ్గరకు చేరవేయడం.. జనాలు తమకు ఈ సమస్యఉందని గుర్తించి సదరు ఆస్పత్రికి వచ్చే విధంగా చేయడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఇన్ స్టా గ్రాం, ఫేస్ బుక్, ఎక్స్ తదితర ప్లాట్ ఫాంలో వందల కొద్ది వీడియో ఉండటం విశేషం. పేషంట్లను ట్రీట్ చేసే విధానంతో పాటు క్యూర్ అయినట్లు నటించే వాళ్లతో కూడా వీడియోలు చేయించి సోషల్ మీడియాలో వదిలేశారు. ఇక్కడో తమాషా ఏంటంటే క్యూర్ అయిన వ్యక్తులు నరేష్ ట్రీట్ మెంట్ వల్ల ఎలా బయటపడ్డామో చెబుతుంటారే తప్ప.. ఎక్కడా తమ ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఫేక్ వీడియోలతో బురిడీ కొట్టిస్తున్నాడు. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాలే కాదు.. విజయవాడ, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా జనాలు రావడం గమనార్హం.

అధికార గణం ఏమిచేస్తున్నట్లో..

ఏన్కూరు ప్రధాన రహదారి వెంబడి గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న కారణంగా ఏంటనేది అంతుచిక్కడం లేదు. డాక్టర్ గా చెలామణి అవుతూ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు నటిస్తున్న నరేష్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది అనుమానాలకు దారితీస్తుంది. పోలిటికల్ నేపథ్యమంటూ అధికారులను బెదిరిస్తున్నాడా? లేదంటే అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇంతటి వ్యవస్థను మెయింటేన్ చేస్తున్నాడా? అన్న సందేహం కలుగుతుంది. ఈ విషయమైన డీఎంహెచ్ఓ వరికూటి సుబ్బరావును వివరణ అడగ్గా.. ఆర్ఎంపీలు అలాంటి వైద్యం చేయడానికి వీలు లేదని, ఎవరు నిబంధనలు అతిక్రమించినా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తామని ‘దిశ’కు వెల్లడించాడు.

సమాజసేవ చేస్తున్నా..

తాను ఆర్ఎంపీ అయినా సమాజం కోసం చేస్తున్నానని, తనకు వైద్యంలో అన్ని విద్యలు తెలుసని ‘దిశ’కు సదరు ఆర్ఎంపీ నరేష్ దిశ ప్రతినిధికి తెలిపాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం తనకు బాగా తెలుసని, అందువల్లే 12 సంవత్సరాలుగా ప్రాథమిక చికిత్స పేరిట ఏన్కూర్ కేంద్రంలో అనేక మందికి అనేక రకాల వైద్యసేవలు అందిస్తున్నానని పేర్కొన్నాడు. తాను ఎక్కువగా ఖమ్మం, చుట్టుపక్కల ప్రాంతాల వారికి వైద్యం చేయనని, ఇతర ప్రాంతాల వారికి మాత్రమే వైద్యం చేస్తానని సెలవిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed