మియాపూర్‌లో ఎనిమిది ఎకరాలకు పట్టా.. రూ. 800 కోట్ల భూమికి హక్కులు!

by Rajesh |
మియాపూర్‌లో ఎనిమిది ఎకరాలకు పట్టా.. రూ. 800 కోట్ల భూమికి హక్కులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైటెక్ సిటీకి సమీపంలో అత్యంత ఖరీదైన మియాపూర్‌లో ఎనిమిది ఎకరాలకు పట్టా జారీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పటికీ, అది ప్రభుత్వ స్థలమనే వాదనలు ఉన్నప్పటికీ రూ.800 కోట్ల విలువైన భూమికి పాస్ బుక్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మియాపూర్ సర్వే నం. 100/ఆ లో ఎనిమిది ఎకరాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు హక్కులు కల్పించారు. ఆధార్, ఈ కేవైసీ పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారు. ఆ తర్వాత ‘రైట్ టు ప్రైవసీ’ కింద వివరాలను దాచేశారు. అయితే ఈ తతంగమంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కలెక్టర్ గా అమోయ్ కుమార్ ఉన్నప్పుడు జరిగిందని తెలిసింది. అయితే ఆ తర్వాత ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ గా హరీశ్ వచ్చాక ఆ భూమి ట్రాన్సాక్షన్ స్టేటస్ ను బ్లాక్ చేశారు. కానీ పాస్ బుక్ రద్దుకు మాత్రం అధికారులు వెనుకాడుతున్నారు.

తహశీల్దార్ రిపోర్ట్ లేకుండానే!

మియాపూర్ లోని సర్వే నంబర్ 100లో వందలాది ఎకరాల భూములు వివాదాస్పదంగా ఉండగా.. కేవలం ఎనిమిది ఎకరాలకు మాత్రమే పట్టా జారీ చేయడం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు అంత విలువైన భూమికి పాస్ బుక్ జారీ చేశారనే చర్చ జరుగుతున్నది. అసలు ఎన్వోసీ ఎక్కడి నుంచి లభించిందనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతున్నది. ఈ విషయంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే.. తమకేం తెలియదంటున్నారు. ఈ ల్యాండ్ క్లియరెన్స్ కి తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. సదరు ఖాతా నంబరులోని స్థలానికి సంబంధించిన రిపోర్ట్ కావాలని ఏ అధికారి నుంచి ఆదేశాలు రాలేదని, తాము ఎలాంటి వివరాలు కలెక్టరేట్, ఆర్డీవోలకు పంపలేదని డిప్యూటీ తహశీల్దార్ శంకర్ ‘దిశ’కు చెప్పారు.

అయితే ఏ చిన్న మ్యుటేషన్, పీవోబీ తొలగింపు, తప్పొప్పుల సవరణకు తహశీల్దార్ నుంచి రిపోర్ట్ అడిగే ఉన్నతాధికారులు.. రూ.వందల కోట్ల ఖరీదైన ల్యాండ్ క్లియరెన్స్ కి ఎందుకు రిపోర్ట్ అడలేదనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కలెక్టర్ గా అమోయ్ కుమార్ ఉన్న సమయంలో పట్టా జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఆయన బదిలీ తర్వాత కలెక్టర్ గా హరీశ్ రాగానే శేరిలింగంపల్లి మండల ఆఫీసు నుంచి ఈ ఖాతాను బ్లాక్ చేయాలంటూ రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ట్రాన్సాక్షన్ స్టేటస్ మాత్రం బ్లాక్ చేశారు. అయితే కలెక్టర్ కి పంపిన వివరాల గురించి అడిగితే తహశీల్దార్ ను అడిగి చెప్తానంటూ డీటీ శంకర్ దాటవేయడం గమనార్హం.

అయితే ట్రాన్సాక్షన్ మాత్రమే బ్లాక్ చేసి.. పట్టా ఎందుకు రద్దు చేయలేదనే అనుమానం వ్యక్తమవుతున్నది. దీని వెనక పెద్దోళ్లు ఉండడంతోనే కిందిస్థాయి సిబ్బంది అంతా ఉన్నతాధికారులకే తెలుసు అని తప్పించుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సక్రమంగా హక్కులు పొంది ఉన్నట్లయితే వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఏకపక్షంగానేనా!

అప్పటి కలెక్టర్ అమోయ్ కుమారే స్వయంగా సర్వే నం.100లో హక్కులు కల్పించారా లేక దీని వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపై శేరిలింగంపల్లి మండల కార్యాలయం ఎలాంటి రిపోర్ట్ అడగలేదు. దీంతో ఈ 8 ఎకరాలపై ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని స్పష్టమైంది. అంటే కలెక్టర్ కార్యాలయంలోనే రికమండేషన్ ఫైల్ జనరేట్ చేశారని తెలుస్తున్నది. అలా ఫైల్ రూపొందించడానికి లేదా ఎలాంటి రికమండేషన్స్ లేకుండానే క్లియర్ చేసేందుకు అవకాశం ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంత వివాదాస్పద ల్యాండ్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలు స్పందించాల్సిన అవసరముంది.

మరికొందరి పట్ల ఇలా..

– మియాపూర్ సర్వే నం.100/ఆ లో ఖాతా నం.289 ద్వారా ఎన్. జైరాం, నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా, 8 ఎకరాల ల్యాండ్ ని పీవోబీ నుంచి తొలగించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

– సర్వే నం.100/ఆ లో ఖాతా నం.288 ద్వారా ఎస్వీ నర్సయ్య.. 29 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇది మాత్రం సివిల్ కోర్టులో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. పాసు బుక్ కూడా జారీ చేయలేదు.

– సర్వే నం.100/అ లో ఖాతా నం.287 ద్వారా రహేమత్ ఉన్నీసాబేగం ఏకంగా 232.05 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇది కూడా సివిల్ కోర్టులో ఉందని, నిషేధిత జాబితాలో పేర్కొన్నారు.

కాపాడాల్సిన బాధ్యత హెచ్ఎండీఏదే..

శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో సర్వే నం.100, 101 లోని 550 ఎకరాల భూమి ఎంతో కాలంగా వివాదాస్పదంగానే కొనసాగుతున్నది. అందరూ అందినంత కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వేలం వేస్తే ఎకరం రూ.100 కోట్లు పలుకుతుందని అధికారులు అంటున్నారు. అలాంటి ఖరీదైన భూమిని కాపాడే బాధ్యత ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఈ భూమి హెచ్ఎండీఏకి అప్పగించినప్పటి నుంచి ఎంత ల్యాండ్ అదృశ్యమైందనే దానిపై విచారణ జరగాల్సిన అవసరముంది. ఈ భూమిని ఖాళీగా వదిలేయడం ద్వారా అనేక వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అత్యంత ఖరీదైన స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత హెచ్ఎండీఏ అధికారులపై ఉన్నది.

కబ్జా ప్రయత్నాలు.. పోలీసులపై దాడి

హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న మియాపూర్ లో వందలాది ఎకరాలపై దశాబ్దాలుగా వివాదం నడుస్తూనే ఉన్నది. అయితే ఇటీవల ఆ భూములను కబ్జా చేసేందుకు వందలాది మంది రావడం సంచలనంగా మారింది. భూమిని క్లీన్ చేసి తమదంటూ జెండా పాతారు. పోలీసులు రంగప్రవేశం చేసి మైకులు పెట్టి మరీ హెచ్చరించినా ససేమిరా అన్నారు. కొందరు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అసలు ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని వీరిని తీసుకొచ్చింది ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. జెండాలు పాతి పోలీసులపైనా రాళ్లతో దాడి చేయడం వెనక ఉన్న అదృశ్యశక్తులెవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి వెనక బడాబాబులు ఉన్నారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed