రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన : ఎంపీ ఈటెల రాజేందర్

by Kalyani |
రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన : ఎంపీ ఈటెల రాజేందర్
X

దిశ చైతన్యపురి : రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో పేదలకు హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఉరివేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బిజెపి చేపట్టిన మూసీ ఇండ్ల బాధితులకు రక్షణగా ఒక్కరోజు నిద్ర కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి డివిజన్ లోని ఫణిగిరి మారుతి నగర్ లో ఆయన నివాసితులతో సమావేశమై వారిని ఉద్దేశించి మాట్లాడారు. “రేవంత్ రెడ్డి నీకు నడమంత్రాన ఈ పదవి వచ్చింది. వాళ్ళు తప్పు చేస్తే వారిని ఓడగొట్టాలని కసితో నీకు ఓట్లు వేశారు. కానీ సంవత్సర కాలంగా ప్రశాంతత లేకుండా చేశావు. పేదల బ్రతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు”. ముసలి కన్నీరు కారుస్తున్నావని విమర్శించారు. “ఆయన ప్రేమ మూసీ పక్కన ఉన్న ప్రజల మీదనో, నల్గొండ ప్రజానీకం మీదనో కాదు ఆయన ప్రేమ బిల్డర్లకు భూములు కట్టబెట్టే ప్రేమగా అభివర్ణించారు.

ఆయనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు కాదు. వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించేందుకు తెలంగాణను దోచుకుని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కోసం డబ్బులు పంపిస్తూ తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. మీరు పాదయాత్రలు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడన్నారు. మొన్ననే డిపిఆర్ కి డబ్బులు విడుదల చేశాము డీపీఆర్ రావడానికి 18 నెలల టైం పడుతుందన్నావు మరి డిపిఆర్ తయారు కానప్పుడు ఏ ధైర్యంతో పనిగిరి కాలనీలో ఆర్ బి ఎక్స్ అని మార్కింగ్ చేశారని నిలదీశారు. మీరు పెట్టిన హింసకు తాళలేక లక్ష్మమ్మ అనే మహిళ హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని, నాగిరెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు.

కూకట్పల్లి నల్లచెరువులో బుచ్చమ్మ అనే మహిళ పిల్లలకు పంచిన ఆస్తి పోతుందనే ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు, డ్రైనేజీ కలిసి మూసీ కంపుగా తయారయిందని ముందు అవి రాకుండా చేయాలి కదా అవి చేయకుండా ఇళ్లను కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి కి ఏం పిచ్చి పట్టింది మా వెంట ఎందుకు పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని, చైతన్యపురికో, రామంతపూర్ కి రావడానికి రేవంత్ రెడ్డికి ముఖం లేదని నల్గొండ వెళ్లి అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు లేవు, మధ్యాహ్న భోజనానికి డబ్బులు లేవు కానీ లక్షన్నర కోట్లు ఎక్కడివి.. ఈ మతలబు ఏంటన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి వాటిని పక్కదోవ పట్టించడానికి మూసీ ప్రక్షాళన తెరమీదకు తెచ్చారని పేర్కొన్నారు. ఆయన వెంట బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు రంగ నరసింహ గుప్త, నాయి కోటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed