పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం అతి పెద్ద నేరం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం అతి పెద్ద నేరం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “టిక్కెట్లు కేటాయింపులో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయమే ఫైనల్. ఎంపికలో నా ప్రమేయం ఉండదు. ఇక మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అతి పెద్ద నేరం. జనగామ సీటు కోసం అధిష్టానానికి కొమ్మూరి ప్రతాప్, పొన్నాల పేర్లు పంపినం. ఇంకా టికెట్లు ఖరారు కాలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. ఈ సమయంలో పొన్నాల ఏ కారణం చెప్పి పార్టీకి రాజీనామా చేశారు? పార్టీ కార్యకర్తలకు పొన్నాల లక్ష్మయ్య క్షమాపణ చెప్పాలి.” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. త్వరలో 119 మంది అభ్యర్ధుల ఫైనల్ జాబితాను ప్రకటిస్తామన్నారు.

చార్మినార్ నియోజకవర్గం నుంచి అలీ మస్కతీని పోటీ చేయించాలని పార్టీ ఆదేశించిందన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులతో చర్చించి ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, ఈ సునామీలో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజలకు ద్రోహం చేశాయన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. అందుకే బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయన్నారు.

రాష్ట్ర డీజీపీ, స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు, భుజంగరావులు ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో చాలా మంది రిటైర్ అయ్యారని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ అధికారులను వెంటనే తొలగించాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. ఇక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ప్రైవేట్ సైన్యాధిపతిగా మారారన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక మైనార్టీలంతా బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని స్టీఫెన్ రవీంద్ర బెదిరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

పైగా ఈ అధికారులంతా ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను రవాణా చేయిస్తున్నారన్నారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్, బీఆర్ఎస్ కు చందాలు ఇవ్వాలని వ్యాపారస్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేశారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా అరవింద్ కుమార్ భూ వినియోగ మార్పిడి చేపట్టారన్నారు.

ఎన్నికల అధికారులు వీళ్లను వదిలేసి కొద్ది మంది అధికారులపైనే చర్యలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న 75 మంది వివరాలను కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అందించడం విచిత్రంగా ఉన్నదన్నారు. వాళ్ల ఫోన్‌లపై నిఘా పెట్టి బీఆరెస్, బీజేపీ సమన్వయంతో ముందుకు వెళుతోందన్నారు. ఇదీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని రేవంత్ మండిపడ్డారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానం తలుపు తడతామన్నారు. అన్ని విభాగాల్లో రిటైర్ అయిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story