కొండగట్టు అంజన్నని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |
కొండగట్టు అంజన్నని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
X

దిశ, మల్యాల: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేయించి, శాలువా కప్పి సన్మానించా‌రు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.

ఘాట్ రోడ్‌లో జరిగిన బస్సు ప్రమాదం వల్ల మృతి చెందిన వారికి, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అందకపోవడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఆయన నిరంకుశ పాలనకు అర్థం పడుతోందన్నారు. ఇకనైనా స్పందించి వారికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే కొండగట్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ రూ.500 కోట్లను విడుదల చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొండగట్టు కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని తెలిపారు.

సీఎం కేసీఆర్ కొండగట్టును అభివృద్ధి పరుస్తారనె నమ్మకం తనకు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొండగట్టు‌పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed