నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవాళ్లు: KCR ఫ్యామిలీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవాళ్లు: KCR ఫ్యామిలీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు తెలంగాణతో సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పేగు, పేరు బంధాలేవీ లేవని విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్​పోలీస్​ స్టేషన్ ​వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్​ కుమారుడు అనే హోదాలో మాత్రమే కేటీఆర్ ​సర్వం అనుభవిస్తున్నాడన్నారు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్​అండ్​ఫ్యామిలీ నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవాళ్లని విమర్శించారు.

ప్రియాంక కాళ్లకు నమస్కరిస్తే, పాపాలన్నీ పోతాయని కేటీఆర్​కు సూచించారు. త్యాగాల కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారని స్పష్టం చేశారు. 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులను స్టడీ చేయాలా? పంట నష్టం ఇవ్వని రైతుల గోసాను స్టడీ చేయాలా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పత్రాలు దిద్దితే 25 మంది విద్యార్థులు చనిపోయారని, పరీక్ష పేపర్ల లీకేజీ దారుణమన్నారు. ఇక ఈ నెల 10 న కర్ణాటక ప్రజలు తమ తీర్పును వెల్లడించబోతున్నారన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలతో పార్టీలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుందన్నారు. మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో టీపీసీసీ నేతలంతా కర్ణాటకలో ప్రచారం చేశామన్నారు. చిట్టపుర్ లో ఖర్గే తర్వాత ప్రియాంక్ ఖర్గే నేతృత్వం వహిస్తున్నారన్నారు. కర్ణాటకలో ఖర్గే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ఓటమి ఎరుగని ఖర్గే లోక్ సభలో మోడీ అవినీతిని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేశారన్నారు. అందుకే కక్షగట్టిన బీజేపీ 2019లో ఓడించిందన్నారు. ఇప్పుడు ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేను ఓడించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందన్నారు. నగర బహిష్కరణకు గురైన ఒక రౌడీషీటర్ ను బీజేపీ చిట్టపుర్ బరిలో దించిందన్నారు.

రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఖర్గేను మణికంఠ రాథోడ్ హత్య చేస్తానని బెదిరించడం దారుణమన్నారు. కుటుంబంతో సహా హత్య చేస్తానని బెదిరించిన ఆడియోలు బయటకు వచ్చాయన్నారు. నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారి కుటుంబాన్ని హత్య చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రేవంత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed