మా పని అయిపోయిందన్న వాళ్లు పత్తా లేరు.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

by Prasad Jukanti |
మా పని అయిపోయిందన్న వాళ్లు పత్తా లేరు..  కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో/రంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ సర్కారును కూలుస్తామని, మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వారి పార్టీలో ఎవరున్నారు? ఎవరు పోయారు? అని రోజూ లెక్క పెట్టుకునే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముచ్చటించిన రేవంత్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ వారు అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వాన్ని మేము నిలబెడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతుగా ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు ఉండబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిస్తే అందులో 3 నెలలు ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయిందని చెప్పారు.

గౌడ వర్గానికి ప్రాధాన్యం

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గౌడన్నల కృషి ఉందని, పార్టీ, ప్రభుత్వ పదవుల్లో గౌడ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. తాటి, ఈత వనాలు పెంచేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూమి కేటాయించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. వన మహోత్సవంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కాల్వల వెంట, మిషన్ కాకతీయ పూడికలు తీసిన చెరువుల వెంట తాటి, ఈతచెట్లు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని వేదిక పైనుంచే మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

హయత్ నగర్‌కు మెట్రో రైలు

రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు భవిష్యత్‌లో రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసుకోబోతున్నామని, అప్పుడు రంగారెడ్డి జిల్లా భూములు బంగారం అవుతాయని సీఎం చెప్పారు. తొందరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రైలు రాబోతున్నదని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతున్నదని, సైబరాబాద్ పేరుతో హైదరాబాద్‌లో ఎలా అభివృద్ధి జరిగిందో తొందరలోనే న్యూయార్క్‌తో పోటీ పడేలా మహేశ్వరంలో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నామన్నారు. శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్, రాచకొండ ప్రాంతంలో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు

నిరుద్యోగులతో చర్చలకు సిద్ధం

నియామక పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. పరీక్షలను కొంతమంది వాయిదా వేయాలని కోరితే మరికొందరు ముందుకు పోవాలని అంటున్నారని తెలిపారు. నిరుద్యోగుల బాధలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. పరీక్షల వాయిదా కోసం రోడ్డెక్కే బదులు మంత్రులను కలిసి చర్చిస్తే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని చెప్పారు.

Advertisement

Next Story