MLC Elections: ఎమ్మెల్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు రిజైన్.. మరింత రంజుగా తెలంగాణ రాజకీయం

by Prasad Jukanti |
MLC Elections: ఎమ్మెల్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు రిజైన్.. మరింత రంజుగా తెలంగాణ రాజకీయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం (Telangana Politics) మరోసారి రసవత్తరంగా మారుతోంది. వచ్చే సంక్రాంతి నాటికి స్థానిక సంస్థల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడేలా త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు పొలిటికల్ హీట్ పెంచుతుంటే.. మరోవైపు రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ (MLC Elections) మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అంశంపై ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికలు రచిస్తుండగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటుండటం ఈ ఎన్నికను మరింత రసవత్తరంగా మారుస్తున్నది.

మొన్న ప్రొఫెసర్, నేడు డీఎస్పీ:

కరీంనగర్-మెదక్-నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టాభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు ఇప్పటి నుంచే తమ పొలిటికల్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలలోని ఆశావాహులు టికెట్ కోసం ఇప్పటి నుంచే తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం అవుతుండం రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నది, ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు తమ సర్వీసును వదులుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఇటీవల గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ (Puli Harikrishna) తన ఉద్యోగానికి రాజీనామా చేయగా తాజాగా మదనం గంగాధర్ (DSP Gangadhar) తన డీఎస్పీ ఉద్యోగాని రిజైన్ చేసి సంచలనంగా మారారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన పులి ప్రసన్న హరికృష్ణ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.

పోలీస్ టు పాలిటిక్స్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన గంగాధర్ అత్యంత నిరుపేద కుటంబంలో జన్మించారు. 22 ఏళ్లకే తొలి ప్రయత్నంలో ఎస్ఐగా సెలెక్ట్ అయిన గంగాధర్ పొలిస్ టు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విధి నిర్వాహణలో ఆయన చేసిన సేవలకు కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యంత్రి సర్వోన్నత పతకాలు పొందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 200 రివార్డులను గంగాధర్ అందుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్ లీక్ కేసు విచారణలోనూ ఆయన పాల్గొన్నారు. ఇన్నాళ్లు పోలీస్ గా సేవలందించిన గంగాధర్ ఇక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు.

ప్రధాన పార్టీలలోనూ ఆశావాహుల హడావుడి:

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. అధికార కాంగ్రెస్ ఇప్పటికే సమీకరణాలు వేసుకుంటుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ (BJP) వేగవంతం చేసింది. ఈ విషయంలో వచ్చే గురవారం కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక మొన్నటి వరకు అదికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) లోక్ సభ ఫలితాలతో డీలా పడిపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లు నమోదులో దూసుకెళ్తుంటే గులాబీ పార్టీ నేతలు మాత్రం లైట్ తీసుకుంటోందనే చర్చ జరుగుతున్నది. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీ చేస్తుందా లేదా అనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story