Reservation : మాదిగలకు 7 శాతం.. 15 % రిజర్వేషన్‌ లెక్కలపై క్లారిటీ ఇదే..!

by Rajesh |
Reservation : మాదిగలకు 7 శాతం.. 15 % రిజర్వేషన్‌ లెక్కలపై క్లారిటీ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆ తీర్పునకు అనుగుణంగా కులాలవారీగా రిజర్వేషన్లను అమలు చేయడంపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన గెజిట్ ప్రకారం ఎస్సీలకు ఇప్పుడు అమలు చేస్తున్న మొత్తం 15 % రిజర్వేషన్‌లో మాదిగలకు 7 %, మాలలకు 6 %, రెల్లి తదితర కులాలకు 1 %, ఆది ఆంధ్రులకు 1 % చొప్పున వర్తించనున్నది.

ఎస్సీలను మొత్తం నాలుగు గ్రూపులుగా అప్పటి ప్రభుత్వం విభజించడంతో రెల్లి తదితర 12 కులాలు ‘ఏ’ గ్రూపులో, మాదిగ సహా 18 కులాలు ‘బీ’ గ్రూపులో, మాల సహా మొత్తం 25 కులాలు ‘సీ’ గ్రూపులో, ఆది ఆంధ్ర సహా నాలుగు కులాలు ‘డీ’ గ్రూపులో ఉన్నాయి. ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొంది దాదాపు ఐదేండ్ల పాటు అమలైనందున ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్నే అమలు చేస్తుందా?.. లేక పునర్ వ్యవస్థీకరిస్తుందా?..వీటిపై త్వరలో స్పష్టత రానున్నది.

వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్సు.. సీఎం ప్రకటన

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ వర్గీకరణ అమలుపై సందేహాలు తలెత్తాయి. తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌‌రెడ్డి స్పందించడం, ఇప్పటికే విడుదలైన జాబ్ నోటిఫికేషన్లకు అవసరమైతే ఆర్డినెన్సు జారీ చేసి వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు ప్రకటించడం కీలకంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాలుగా అటు న్యాయస్థానాల్లో, ఇటు ప్రభుత్వాలు, పార్టీల స్థాయిలో చర్చనీయాంశంగా, వివాదంగా ఉన్న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణను సమర్థిస్తూ స్పష్టత ఇవ్వడంతో దాని అమలుపై రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కులాలవారీగా గ్రూపుల జాబితా రెడీగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు విధాన నిర్ణయం తీసుకుని అమలు చేయడమే తరువాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 1997లోనే కులాలను నాలుగు గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సును రూపొందించి 1999 డిసెంబరు 9 నుంచి అమలు చేసింది. ఆ తర్వాత 2000 మే 2వ తేదీన గెజిట్ జారీ కావడంతో పూర్తిస్థాయిలో అమలైంది. కానీ సుప్రీంకోర్టు కోర్టు 2004లో ఈ ఉత్తర్వులను కొట్టేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఉమ్మడి రాష్ట్రంలోనే రిజర్వేషన్ ఫార్ములా

ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన చట్టం ప్రకారం ఎస్సీలు నాలుగు గ్రూపుల కింద మొత్తం 57 కులాలు, వాటి కింద మరికొన్ని ఉప కులాలకు రిజర్వేషన్ ఫార్ములా ఖరారైంది. అత్యంత వెనకబడిన కులాలను ‘ఏ’ గ్రూపులో, ఆ తర్వాత కాస్త వెనకబడిన కులాలను ‘బీ’ గ్రూపులో... ఇలా ఆర్థిక, సామాజిక అసమానతలు, అంతరాలను దృష్టిలో పెట్టుకుని గ్రూపుల జాబితా రూపొందింది. బావురి, చచాతి, ఛండాల, దందాసి, డోము (డొంబర, పైడి, పనో), ఘాసి (హడ్డి, చచాండి), గోడగల్లి, మెహ్తర్, పాకి (మోటి, తోటి), పామిడి, రెల్లి, సప్రు కులాలను ‘ఏ’ గ్రూపులో చేర్చింది. అరుంధతీయ, బైండ్ల మేడ, జంగం, (బుడగ జంగం) చమర్ (మోచి, ముచ్), ఛంబర్, డక్కలి (డొక్కల్వర్), ధోర్, గోదారి, జగ్గలి, జాంబవులు, కొలుపువాండ్లు, మాదిగ, మాదిగదాసరి (మాదిగ దాసు మష్తీన్), మంగ్, మంగ్ గరోడి, మాతంగి, సమగర, సింధోళ్లు (చిందోళ్లు) ‘బీ’ గ్రూపులో ఉన్నాయి.

‘సీ’ గ్రూపులో మొత్తం 25 కులాలు

మాల, మాలదాసరి, ఆరె మాల, అరవ మాల, మహర్, ఆది ద్రావిడ, అనాముఖ, బరికి, భైగార, చలవాడి, ఎల్లమ్మల్వర్, (ఎల్లమ్మవాండ్లు), గోసంగి, హోలేయ, హోలేయ దాసరి, మాదాసి కురువ (మాదారి కురువ), మాల హనాని, మాలజంగం, మాల మస్తి, మాలసాలె (నేతకాని), మాల సన్యాసి, మన్నె, ముండాల, పాంబడ (పాంబండ), సంబన్.. మొత్తం 25 కులాలు ‘సీ’ గ్రూపులో ఉన్నాయి. ఇక ఆది ఆంధ్ర, మష్తి, మిథ అయ్యల్వర్, పంచమ, పరయ కులాలు ‘డీ’ గ్రూపులో ఉన్నాయి. ‘ఏ’, ‘డీ’ గ్రూపులకు చెరి ఒక శాతం చొప్పున రిజర్వేషన్ అమలు కానుండగా, ‘బీ’, ‘సీ’ గ్రూపులకు 7 %, 6 % చొప్పున అమలు కానున్నాయి. ఈ వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుందా?... లేక కేబినెట్ సబ్ కమిటీ లేదా కమిషన్ లాంటివి నియమించి అధ్యయనం తర్వాత కొత్త ఫార్ములాను రూపొందిస్తుందా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉన్నది.

విభజన తర్వాత కులాల జనాభాలో మార్పు

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది మాదిగలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా మాలలు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీలు మొత్తం 54.32 లక్షలు ఉంటే అందులో మాదిగలు 32.22 లక్షలు, మాలలు 15.27 లక్షలు అనే లెక్కలు వెలువడ్డాయి. దీంతో వర్గీకరణ ద్వారా మాదిగలకు 7 % రిజర్వేషన్ దక్కినా సరైన న్యాయం లభించదనేది మాదిగ సంఘాల వాదన. జనాభా లెక్కల ప్రకారం కనీసంగా 12 % రిజర్వేషన్ మాదిగలకు దక్కాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాయి.

మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు

రాష్ట్రంలోని కూర్పు ప్రకారం మాలలకంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు ఉన్నప్పటికీ రిజర్వేషన్‌ మాత్రం కేవలం 1 % తేడా మాత్రమే ఉన్నదని, వర్గీకరణ ద్వారా మాదిగల కంటే మాలలే తెలంగాణలో ఎక్కువ లబ్ధి పొందుతారన్నది ఆ సంఘాల వాదన. మాల, మాదిగల మధ్య రిజర్వేషన్ ఫలాల అసమానతలను రూపుమాపేందుకు వర్గీకరణ డిమాండ్ తెరపైకి వచ్చినా ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించినా..ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇలాంటి తీర్పు వచ్చి ఉంటే రెండు కులాలకూ న్యాయం జరిగేదని, కానీ మూడు దశాబ్దాల తర్వాత రావడంతో అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడలేదన్నది వాటి వాదన.

‘కులగణన’ తర్వాతే జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్!

ఇలాంటి అంశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ రిజర్వేషన్ ఫార్ములాను ఎలా అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు కారణంగా గతంతో పోలిస్తే మాదిగలకు కాస్త లబ్ధి చేకూరే పరిస్థితులు ఉన్నప్పటికీ సంపూర్ణ న్యాయం జరగలేదని, అందువల్ల ఇప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కులాలవారీగా జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్‌ను అమలు చేయడం ద్వారానే సామాజిక న్యాయం లభిస్తుందన్నది మాదిగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని, అప్పుడు జనాభా నిష్పత్తిలో అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి సంపూర్ణంగా దక్కుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed