- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంపై విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస చర్యలు చేపట్టాలి.. మంత్రి కొండా సురేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వాగాలతో ముడిపడి ఉందని, ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని మంత్రి సురేఖ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్తర, దక్షిణ సరిహద్దులుగా విస్తరించిన టైగర్ రిజర్వులు తెలంగాణకు ప్రత్యేకతను చేకూర్చాయని, వాటిని ప్రత్యేకతను కాపాడేందుకు అటవీశాఖ నిరంతర చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం మంత్రి కాన్ఫరెన్స్ హాలులో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ల గవర్నింగ్ బాడీస్ సమావేశం నిర్వహించారు. అధికారులు టైగర్ రిజర్వ్ల గవర్నింగ్ బాడీస్, టైగర్ కన్సర్వేషన్ ఫౌండేషన్, గవర్నింగ్ బోర్డుల ఏర్పాటు, విధివిధానాలను వివరించారు.
ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా 2015 ఏప్రిల్ 29న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులను కేంద్రం ఏర్పాటు చేసిందని, పులుల సంరక్షణే లక్ష్యంగా టైగర్ రిజర్వులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్తో వివరించారు. అమ్రబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో చేపడుతున్న గ్రామాల తరలింపుపై మంత్రి ఆరా తీశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో 26 కోర్ (కేంద్రీకృత) గ్రామాలుండగా, ప్రస్తుతం వాటిలో 4 గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు సంపూర్ణమైన నమ్మకాన్ని కల్పిస్తూ, వారి భద్రతకు భరోసానిస్తూ తరలింపు ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న పులుల ఆహారలభ్యతకు అనుగుణంగా జింకల సంఖ్యను పెంచే దిశగా చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల, దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో ప్రస్తుతం పర్యాటక సేవలు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాటేజీలు, సఫారీ వాహనాలు, నేచర్ గైడ్లు, వంటశాల మొదలైన సేవలు, స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక యువతకు శిక్షణనిచ్చి, వారి ఆధ్వర్యంలో వంటశాలను నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు పట్టు పురుగుల పెంపకంపై స్థానికులకు శిక్షణను కల్పించి, ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట - శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. దోమలపెంట-శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లో భాగంగా ఎంతో ప్రాశస్త్యమైన అక్కమహాదేవి గుహలకు తెలంగాణ ప్రభుత్వ పరంగా భూ, జల మార్గాల్లో భక్తులకు యాత్రా సౌకర్యం కల్పించేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలో వున్న తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి, ప్రభుత్వ పరంగా యాత్రా సౌకర్యాలను కల్పించేదిశగా కార్యాచరణను అమలుచేయాలని అధికారులను మంత్రి నిర్దేశించారు.
పునరావాస ప్రక్రియలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించినట్లు అధికారులు వివరించారు. అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి సూచించారు. వన్య ప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఇస్తున్నామన్నారు. ‘స్టేట్ లెవల్ కమిటీ ఫర్ మిటిగేటింగ్ హ్యూమన్ యానిమల్ కాంఫ్లిక్ట్ పూర్తి స్థాయి చర్చల తర్వాత ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెడ్మా బొజ్జు, రేకుపల్లి భూపతి రెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీపీఎఫ్ ఆంజనేయులు (హెడ్ ఆఫీస్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ రాంబాబు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతారాం (కవ్వాల్ టైగర్ రిజర్వ్), డీఎఫ్ఓలు రోహిత్ (నాగర్ కర్నూల్), బాజీరావ్ పాటిల్ (ఆదిలాబాద్), రాజశేఖర్ (నల్గొండ), శివాశిష్(మంచిర్యాల), ఎఫ్డీఓ రామ్మూర్తి (మన్ననూర్), ఓఎస్డీ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.