బ్రేకింగ్: బీఆర్ఎస్‌లో చేరిన బిత్తిరి సత్తి.. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

by Satheesh |   ( Updated:2023-10-27 14:04:40.0  )
బ్రేకింగ్: బీఆర్ఎస్‌లో చేరిన బిత్తిరి సత్తి.. కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ ఖాయమని.. హ్యాట్రిక్ సీఎంగా రికార్డ్ కొట్టబోతున్నారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవికుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి)తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరారు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి మంత్రి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది టికెట్లు అమ్ముకుంటున్న దౌర్బాగ్య పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా.. అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పాలించే సత్తా కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఒకే ఒక్క ఎజెండా అదే రైతుల ఎజెండా అన్నారు. ప్రతిపక్షాలది బూతులు మాట్లాడే ఎజెండా అని దుయ్యబట్టారు. బూతులు మాట్లాడటం చాలా సులువు, కానీ నీళ్లు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అంబేడ్కర్ విగ్రహం కట్టడం కష్టం అన్నారు.

బూతులు మాట్లాడేవాళ్లు కాదు.. భవిష్యత్ నిర్మించే వాళ్లు కావాలన్నారు. ఒకవైపు ఐటీ పరిశ్రమలు, మరో వైపు వ్యవసాయం అభివృద్ధి చేసింది కేసీఆర్ అని, నేడు నీళ్ల కష్టం లేదు, కరెంట్ కోతలు లేవు అని స్పష్టం చేశారు. కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది.. కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు పెరిగాయి.. పెట్టుబడులు వస్తున్నాయి... విశ్వనగరంగా దూసుకుపోతున్నదన్నారు.

కేసీఆర్ అధికారంలోకి రాకపోతే తెలంగాణ అమరావతి లెక్క అవుతుందని రియల్ స్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారన్నారు. అమరావతి చుట్టూ బిజినెస్ అవుట్ అయింది.. గెలిస్తేనే భూముల ధరలు పెరుగుతాయి అని వ్యాపారులు భావిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. అన్నీ సర్వేల్లోనూ బీఆర్ఎస్‌కే అధికారం అని వస్తుందన్నారు. కానీ కొన్ని ఫేక్ సర్వేలు, దొంగ సర్వేలతో అబద్దాలతో బోగస్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story