బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..?

by Sumithra |   ( Updated:2023-03-05 11:03:22.0  )
బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..?
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. నిన్నటివరకు అసమ్మతి వర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ ఇప్పుడు కొంత భయపడుతున్నాడా..? అనే ప్రచారం జోరుగా నడుస్తుంది. నిన్నటివరకు బీఆర్ఎస్ లో అసమ్మతి వర్గం లేదని, ఒకవేళ ఉన్నా అది కేవలం ఉత్తిదే అనేలా ఎమ్మెల్యే ఆనంద్ చూసిచూడనట్లు వ్యవహరించాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏమో గాని ఆత్మీయ సమ్మేళనాల సందర్బంగా ఎంపీ రంజిత్ రెడ్డితోనే గాక, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా ఎమ్మెల్యే టికెట్ మళ్లీ తనకే వస్తుందని, కాబోయే ఎమ్మెల్యే తానే అని చెప్పించుకుంటున్నాడని జిల్లా కేంద్రంలో చర్చ నడుస్తుంది.

ఈ మధ్య బంట్వారం మండలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మళ్లీ ఆనందే అవుతాడని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని అన్నారు. ఇదిలా ఉంటే శనివారం ధారూర్ మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి సబితాఇంద్రారెడ్డి సైతం కాబోయే ఎమ్మెల్యే ఆనంద్ మాత్రమేనని, పైగా జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఆయన డిసైడ్ చేస్తాడని అన్నారు. దీంతో ఇంతకు వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుంది అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

మంత్రి వచ్చినా హాజరుకాని సీనియర్ నాయకులు..

ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సొంత మండలం అయిన ధారూర్ మండలంలోనే ఆయనకు అసమ్మతి వర్గం ఎక్కువయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ప్రధానంగా మాజీ జడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి హనుమంత్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మెన్ సత్యనారాయణ, మరో పీఎస్సీఎస్ చైర్మెన్ పోలీస్ వెంకట్ రెడ్డిలతో పాటు యువ నాయకులు వడ్ల నందు, ప్రముఖ మైనారిటీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రి వచ్చినప్పటికీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో, బీఆర్ఎస్ వర్గపోరు తారాస్థాయికి చేరిందనే చర్చ నడుస్తుంది.

నిన్నటి వరుకు సైలెంట్ గా ఉన్న అసమ్మతి నేతలు ఎంపీ రంజిత్ రెడ్డి స్టేట్మెంట్ తో బయటకు వచ్చి ఎమ్మెల్యేకు దీటుగా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఇకపై అసమ్మతి వర్గం మరింత రెచ్చిపోయేలా ఉందని స్పష్టం అవుతుంది. మరి ఈ పరిస్థితులను అధికమించి ఎమ్మెల్యే ఆనంద్ ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed