కౌన్ బనేగా ఇబ్రహీంపట్నం నెక్ట్స్ MLA.. మంచిరెడ్డి అడ్డాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా..?

by Satheesh |
కౌన్ బనేగా ఇబ్రహీంపట్నం నెక్ట్స్ MLA.. మంచిరెడ్డి అడ్డాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: 1957లో ఏర్పాటైన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009, 2014ల్లో టీడీపీ నుంచి మంచిరెడ్డి కిషన్​రెడ్డి విజయం సాధించారు. 2018లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచారు. హ్యాట్రిక్ విజయంతో ఇబ్రహీం పట్నం నియోజక వర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న మంచిరెడ్డికే ఈసారి కూడా బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే.. మంచిరెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి (బంటి), క్యామ మల్లేష్ కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మల్ రెడ్డి రాంరెడ్డి, శేఖర్ మామ, మర్రి నిరంజన్ రెడ్డి, దండం రాంరెడ్డి, కొత్తకుర్మ శివ కుమార్​తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి క్యాడర్‌తో పాటు అభ్యర్థుల కొరత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ల కోసం ప్రయత్నించి విఫలమైన నాయకుల్లో ఎవరైనా వస్తే తమ పార్టీ తరఫున బరిలో నిలబెట్టాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆదిబట్ల కేంద్రంగా అభివృద్ధి..

ఇబ్రహీంపట్నం మండలంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రధానంగా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఫ్యాక్స్ కాన్, ఎరోస్పేస్, టీసీఎస్, టాటా లాకెట్ మార్టిన్, టాటా సీకో స్కై, బోయింగ్, దేశ, రాష్ట్ర స్ధాయి భద్రతా దళాల కేంద్రాలు, బీడీఎల్, లాజిస్టిక్ పార్క్ లు, పండ్ల మార్కెట్ లాంటి పరిశ్రమలు నెలకొల్పారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షం సుమారు 16 వేల మందికి ఉపాధి దొరుకుతోంది.

అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హౌస్​ కీపింగ్ కింద మరో 50 మంది ఉపాధి పొందుతున్నారు. యాచారం మండలంలో ఫార్మా సిటీని నిర్మించేందుకు వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రహదారుల నిర్మాణం పూర్తయింది. ఫార్మాసిటీ నిర్మాణం పూర్తయితే ఇబ్రహీం పట్నం నియోజక వర్గం కాస్ట్ లీ సిటీగా మారనుంది.

హైదరాబాద్‌కు సమీపంలో..

ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం హైదరాబాద్ నగర శివారులో 1077 చ.కి.మీ. మేర విస్తరించింది. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉండటంతో జిల్లాకు ఇబ్రహీం పట్నం కేంద్రంగా మారే అవకాశం ఉంది. గతంలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఇబ్రహీం పట్నం ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉంది.

గ్రామీణ ఓటర్లు 76%, పట్టణ ఓటర్లు 24% ఉన్నారు. హిందువులు 94%, ముస్లింలు 4%, క్రైస్తవులు ఒక్క శాతం ఉన్నారు. షెడ్యూల్ కులాల వారు 20.74%, షెడ్యూల్ తెగల వారు 7.55% మంది ఉన్నారు. ఇక్కడ అక్షరాస్యత రేటు 66% ఉంది. 18-25 ఏళ్ల ఓటర్లు 15.63%, 25-35 ఏళ్ల ఓటర్లు 31.84%, 35-60 ఏళ్ల ఓటర్లు 42.25%, 60 ఏళ్లకు పైబడిన వారు 10.27% మంది ఉన్నారు.

దీర్ఘకాలిక సమస్యలు..

హైదరాబాద్​నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ సరైన విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం ఇబ్రహీంపట్నం వాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 2007లో ఏర్పాటైన డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. కమిషనరేట్ పరిధికి అప్ గ్రేడ్ అయినప్పటికీ ప్రభుత్వాస్పత్రిలో మందులు, వసతుల కొరత వెంటాడుతోంది.

ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భౌగోళిక శాస్త్ర పరిశోధనా కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇబ్రహీం పట్నం చెరువును ప్రక్షాళన చేస్తామని, రిజర్వాయర్ నిర్మిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆ మాటే మర్చిపోయారు. రిజర్వాయర్ నిర్మిస్తే వేలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్న ఆశ కలగానే మిగిలిపోతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మండలాలు

యాచారం

మంచాల

ఇబ్రహీంపట్నం

అబ్దుల్లాపూర్​మెట్

ఓటర్లు: 2,91,804 (2011 లెక్కల ప్రకారం)

పురుషులు: 1,48,882

మహిళలు: 1,42,896

థర్డ్ జెండర్: 26

2014లో

మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. టీడీపీ.. 48,397 ఓట్లు.. 26.67%

మల్ రెడ్డి రామిరెడ్డి.. ఇండిపెండెంట్.. 37,341 ఓట్లు.. 20.58%

2018లో

మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్.... 72,581 ఓట్లు.. 37.00%

మల్ రెడ్డి రంగారెడ్డి.... కాంగ్రెస్.... 72,205 ఓట్లు.... 37.00%

Advertisement

Next Story

Most Viewed