డివిజన్ స్థాయిలోనే ప్రజావాణి

by Kalyani |
డివిజన్ స్థాయిలోనే ప్రజావాణి
X

దిశ రంగారెడ్డి బ్యూరో : ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోనే ప్రజా సమస్యలు స్వీకరించారు.. ఇక నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆర్డీఓ లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లో సైతం పిర్యాదులు స్వీకరించనున్నారు..దీంతో పాటు జిల్లా ప్రజలు దూర ప్రాంతంలో ఉన్నవాళ్లు ఇబ్బంది పడొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి డివిజన్ కేంద్రంలో కూడా ప్రజావాణి నిర్వహించాలని అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం చాలా పెద్దగా ఉండడం కారణంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రెవెన్యూ తో పాటు ఇతర ఎలాంటి సమస్యలు ఉన్న ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, మీ మీ డివిజన్ స్థాయిలోనే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.

జిల్లాలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్ల పరిధిలో గల ఎంపీడీవో కార్యాలయాలలో డివిజన్ ఆర్డిఓ సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఎలాంటి దరఖాస్తు ఇచ్చిన కలెక్టర్ కార్యాలయానికి చేరుతుంది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఎలాగైతే సమస్య పరిష్కారం అవుతుందో, డివిజన్ స్థాయిలో కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు డివిజన్ స్థాయిలోని ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కావున జిల్లా ప్రజలు, రైతులు ప్రతి సోమవారం మీమీ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వవచ్చాని తెలిపారు.

Advertisement

Next Story