అటవీ భూములకు రక్షణేదీ ?

by Sumithra |
అటవీ భూములకు రక్షణేదీ ?
X

దిశ, ఎల్లారెడ్డి : అటవీ భూముల ఆక్రమణదారులు, స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అడవులు కనుమరుగవుతున్నాయి. భవిష్యత్తు తరాలకు అడవులను మిగల్చకుండా భూ ఆక్రమణదారులు అడవులను యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం ఇదే తీరున అక్రమార్కుల అటవీ భూముల దందా సాగుతోంది. అడ్డుకట్ట వేయడంలో ఫారెస్టు యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు.

రేంజ్ పరిధిలోని అటవీ భూములు అర్ధరాత్రి వేళ ఆక్రమించుకుండడం అధికారులకు తెలిసి తెలియనట్లు వ్యవహరించడం ఆ గ్రామంలోని ఆ తాండాలోని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ భూముల పరిరక్షణకు తోడుండాల్సిన వారే ఆక్రమణకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని వందల ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసిన ఆక్రమణదారులు చివరికి అటవీశాఖ మొక్కలు నాటిన భూమి కూడా వదలకుండా ఆక్రమణకు పాల్పడుతున్నట్లు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఆ నియోజకవర్గంలో ఆ రేంజ్ లో చర్చనీయాంశంగా మారుతోంది. అటవీ భూములను ఆక్రమించుకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నాలు చేపడుతుండడం జిల్లాలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, స్థానిక ప్రజలకు తీరని లోటుగా మిగిలిపోతుంది.

ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని వెళ్లుట్ల, లక్ష్మాపూర్ హాజీపూర్ తండాలో ఎకరాల అటవీ అన్యాక్రాంతం కావడం ధ్వంసం చేసిన వారిపై చర్యలు చేపడతామనడం మాటలకే పరిమితమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ పరిధిలో హాజీపూర్ బీట్ అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాత్రిపూట ఆక్రమణలు అడవిలోని చెట్లు, పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులు అటవీ శాఖ అధికారుల అండదండలతోనే నరుకుతున్నట్లు స్థానికుల సమాచారం. కొన్ని రోజుల నుంచి హాజీపూర్, వెళుట్ల, బొల్లారం, అటవీ ప్రాంతంలో చెట్ల నరుకుతున్నప్పటికీ అటువైపు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అందుకు అటవీ శాఖ అధికారులే వారికి ధైర్యమని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు.

కనుమరుగవుతున్న అడవులు..

ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, చేపట్టి మరోవైపు ఆక్రమణదారులు, స్మగ్లర్లు, కలవ వ్యాపారులతో అటవిని కొల్లగొడుతున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, స్మగ్లర్లు, కొందరు వ్యాపారులు చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తున్నారు. యంత్రాల సహాయంతో భారీ వృక్షాలను నరికి వేస్తూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పంటల సాగు పేరిట మరికొందరు అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. ఎల్లారెడ్డి రేంజ్, ఒకప్పుడు ఎక్కడ చూసినా అటవితో పచ్చదనం ఉండేది. మండలంలోని తండా తదితర తండాల్లో అడవులు లేకుండాపోయాయి. ఆక్రమణదారులు, స్మగ్లర్లు విచ్చలవిడిగా చెట్లను నరికి వేస్తూ అటవీ భూమిని కబ్జా చేశారు. ఇలా మండలంలోనే కాకుండా మాచారెడ్డి, లింగంపేట్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోనూ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వారు అటవీ భూములను అక్రమించుకొని చెట్లను నరికి వేసి కబ్జా చేస్తున్నారు. ఇలా కలప స్మగ్లర్లు, భూ కబ్జాదారులు అటవీ ప్రాంతాన్ని కొల్లగొడుతుండడంతో జిల్లాలో అడవులు కనుమరుగవుతున్నాయి. అటవీ శాఖ అధికారుల అండదండలే వారికి కొండంత ధీమాగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed