పడకేసిన ప్రత్యేక పాలన.. వేధిస్తున్న పనిభారం.. నిధుల కొరత!

by Anjali |
పడకేసిన ప్రత్యేక పాలన.. వేధిస్తున్న పనిభారం.. నిధుల కొరత!
X

దిశ, తాండూరు: ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రతి గ్రామం ఆదర్శంగా ఉండాలి. ప్రత్యేకాధికారులంతా డివిజన్‌, మండలస్థాయి అధికారులే.. అయినందున వాళ్ల చేతల్లో గ్రామాలు అద్దంలా మెరిసిపోవాలి. అయితే ప్రత్యేకాధికారులు గ్రామాలను కన్నెత్తి చూడకపోవడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. సర్పంచులు ఉన్నప్పుడు గ్రామస్తులు ప్రశ్నించడానికైనా అవకాశం ఉంటుంది. ప్రత్యేకాధికారులు పాలనలో ఆ అవకాశం లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

పాలన అస్తవ్యస్తంగా ఉన్నా చూసే వారే కరవు..

గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్‌ అధికారులను నియమించింది. వారికి నిధులు, విధుల కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడంతో పల్లె పాలన పడకేసింది. దీంతో గ్రామపంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం కరెంటు బల్బులు, బోరు మరమ్మతులు, ట్రాక్టర్లకు డీజిల్‌ కొనలేని పరిస్థితి ఏర్పడింది. మల్టీ పర్పస్‌ వర్కర్లకు 5,6 నెలలుగా జీతాలు కరువయ్యాయి. ఈ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది.

కేవలం సంతకాలకే పరిమితం..!

పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యాక పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గెజిటెడ్‌ హోదా కలిగిన 11కేటగిరీల అధికారులకు పంచాయతీలను కేటాయించారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలు, ఎంపీవోలు, ఎంఈవోలు, మండల వ్యవసాయాధికారులు, వివిధ శాఖల ఏఈఈలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. స్పెషలాఫీసర్లుగా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులనూ నియమించారు. ఒక్కో గెజిటెడ్‌ అధికారికి రెండు నుంచి మూడు, నాలుగు పంచాయతీలు అప్పగించగా, పంచాయతీలు ఎక్కువ ఉన్న మండలాల్లో ఐదారు పంచాయతీలను అప్పగించారు. వికారాబాద్ జిల్లాలో గల 566 పంచాయతీలకు 163మంది గెజిటెడ్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఒక్కొక్కరికి 2,3పంచాయతీల బాధ్యతలు ఉన్నాయి. దీంతో వారు పంచాయతీల పాలన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకసారి సైతం గ్రామాలకు రావడం లేదు. దీంతో కార్యదర్శులే ముఖ్యమైన పనులు, సంతకాల కోసం ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్తున్నారు.

ప్రత్యేక పాలనలో.. కొత్త చిక్కులు

పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. పాలకవర్గాల గడువు ముగియడంతో, ప్రత్యేక అధికారుల పాలనలో నెట్టుకొస్తున్న పంచాయతీల్లో, ప్రత్యేక అధికారుల పాలనతో కొత్త చిక్కులు తప్పడం లేదు. అసలే ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాల్లో, ఒక్కో అధికారికి మూడు నాలుగు పంచాయతీల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగానే పల్లెల్లో పర్యటనలు చేస్తుండటంతో, సమస్యల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు, విధుల భారంతో వారానికోసారి సైతం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, చాలావరకు పంచాయతీల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా తాగునీటి సమస్యలతో కోటపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేసిన విషయం తెలిసిందే. యాలాల మండలం తుప్పర్లగడ్డ తండాలో గిరిజనులు తీవ్రంగా నీటి కష్టాలు పడ్డారు. స్థానిక ఎంపీపీ వెంటనే స్పందించి బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు.

అప్పుల ఊబిలో పంచాయతీ కార్యదర్శులు

పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం పడుతున్నది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 6 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామ స్థాయిలో ఏ చిన్న మీటింగ్‌ జరిగినా పంచాయతీ కార్యదర్శులే జేబు నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని చిన్న చిన్న అవసరాలు తీర్చాలంటే వారే సొంతంగా డబ్బులు సమకూర్చాలిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను గ్రామంలోకి పంపాలంటే దానికి డీజిల్‌ పోయించాల్సి ఉంటుంది. ఒక్క చిన్న గ్రామ పంచాయతీకి లెక్కకట్టినా నెలకు ఎంత లేదన్నా డీజిల్‌కు రూ. 20వేల పైనే ఖర్చు అవుతున్నది. చెత్త సేకరణకు ట్రాక్టర్‌ను పంపకపోతే గ్రామం అంతా కంపు కొడుతుంది.

గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణ, బోర్ల రిపేరు, తాగునీటి పైప్‌ల రిపేరు, పైప్‌లైన్‌ లీకేజీ, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి ఎద్దడి ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ఇలా ఎన్నో పనులు గ్రామాల్లో చూసుకోవాల్సి వస్తున్నదని పంచాయతీ కార్యదర్శులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శులు కొందరు తమ వేతనాల నుంచి, మరికొందరు వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పలు తెచ్చి గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఒకవేళ డబ్బులు లేవని సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి, ఉన్నత స్థాయి అధికారుల నుంచి వేధింపులకు గురికావాల్సి వస్తున్నదని, తమను ఎక్కడ సస్పెన్షన్‌ చేస్తారేమోనని పంచాయతీ కార్యదర్శులు భయపడుతున్నారు.

దీంతో సొంతంగా డబ్బులు ఖర్చుచేసి గ్రామాల్లో అవసరాలను తీర్చుతున్నారు. ఒక్కో చిన్న గ్రామ పంచాయతీ కార్మదర్శి ఇప్పటికే రూ 60 నుంచి 80 వేలు సొంతగా ఖర్చు చేశాడు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో రూ.లక్షల్లోనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది. తమకు వచ్చిన జీతం గ్రామాలకు పెట్టుకుంటా పోతే తమ కుటుంబాలు పోషణ ఎలా గడిచేది ..? అని పంచాయతీ కార్యదర్శు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story