ప్రమాదకరంగా కోళ్ల ఫారాలు... నాలుగు గ్రామాలు ఉక్కిరిబిక్కిరి

by srinivas |   ( Updated:2025-01-06 02:21:43.0  )
ప్రమాదకరంగా కోళ్ల ఫారాలు...  నాలుగు గ్రామాలు ఉక్కిరిబిక్కిరి
X

దిశ, మాడ్గుల : మాడ్గుల మండలంలోని ఆర్కపల్లి, జరుపుల తండా గ్రామపంచాయతీ, కొలుకులపల్లి గ్రామాల సమీపంలోని కోళ్ల ఫారాల నుంచి భరించలేని దుర్గంధం వెలువడుతున్నది. అయినా దానిని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కోళ్ల ఫారాల పరిసరాల్లో చనిపోయిన కోళ్లను వేస్తుండడంతో వ్యర్థాలను తిన్న వీధి కుక్కలు పిచ్చిగా మారి రోడ్లపై వెళ్తున్న వాహనదారులను వెంబడించి కరుస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. కోళ్ల ఫారాల నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో గ్రామాల్లో చిరు వ్యాపారులు విక్రయించే తినుబండారాలపై ఈగలు వాలుతుండడంతో వాటిని తిన్న చిన్నారులు, ప్రజలు అస్వస్థతకు గురవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనల మేరకు నెలలో మూడుసార్లు గ్రామాల్లోని వీధుల్లో దోమలు, ఈగలు ప్రబలకుండా ఫాగింగ్ చేయాల్సి ఉంది. ఫౌల్ట్రీఫామ్ యజమానులు ఈ విషయమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై ఆయా గ్రామాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుర్గంధం వెదజల్లుతున్న ఫౌల్ట్రీఫామ్‌లపై చప్రమాదకరంగా కోళ్ల ఫారాలుర్యలు తీసుకొని విధిగా ఫాగింగ్ చేయించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు..

నిబంధనలను పాటించని ఫౌల్ట్రీ ఫాం యజమానులపై చర్యలు తీసుకుంటాం. కోళ్ల వ్యర్థాలను కాల్చివేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని, విధిగా పరిసర గ్రామాల్లో ఫాగింగ్ చేయాలి. ఫౌల్ర్టీఫామ్ యజమానులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తప్పకుండా నిబంధనలు పాటించాలి.

- వేజన్న, ఎంపీవో

మా దృష్టికి వచ్చింది.. చర్యలు తీసుకుంటాం..

కోలుకులపల్లి గ్రామ సమీపంలోని ఫౌల్ర్టీఫామ్‌ల నుంచి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఫౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించి నిబంధనలను పాటించకుంటే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.

- నవీన్, కార్యదర్శి

Advertisement

Next Story