Bus trouble : స్కూళ్లు వదిలింది 4.15 గంటలకు...బస్సు వచ్చింది 8 గంటలకు

by Sridhar Babu |
Bus trouble : స్కూళ్లు వదిలింది 4.15 గంటలకు...బస్సు వచ్చింది 8 గంటలకు
X

దిశ, బొంరాస్ పేట్ : పాఠశాలలు విడిచిపెట్టింది.. 4:15 గంటలకు. కానీ విద్యార్థులు గమ్యానికి (ఇళ్లకు) చేరింది 8:30 గంటలకు. వివరాల్లోకి వెళితే బొంరాస్ పేట్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలు 4:15 గంటలకు వదిలిపెట్టారు. విద్యార్థులు బస్సు కోసం రాత్రి 8 గంటల వరకు వేచి చూడాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. బస్ షెల్టర్ కూడా లేకపోవడంతో అసలే వారం రోజుల నుండి చిరుజల్లులు పడుతున్నాయి. కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ అక్కడక్కడ తిరుగుతూ కనిపించారు. కిరాణం, బంగారం, స్వీట్, హెయిర్ సెలూన్ దుకాణాల ముందు కూర్చొని విద్యార్థులు తమ హోంవర్క్ చేస్తూ కనిపించారు. రాత్రి 7 దాటినా బస్సు రాకపోవడంతో కొంతమంది విద్యార్థులు పక్కన (దారిలో )వెళ్లే వారి ఫోన్ తీసుకొని

తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తమ వాహనాలపై తీసుకొని వెళ్లారు. కొంతమంది ఆటోల్లో వెళ్లారు. మరి కొంతమంది విద్యార్థులు చేసేది ఏమీ లేక బస్సు కోసం వేచి చూసి రాత్రి 8 గంటలకు వచ్చిన బస్సుకు వెళ్లారు. ఈరోజే బస్సు లేట్ అయిందా అని విద్యార్థులను అడగగా లేదు రోజూ 6:30 తర్వాతనే బస్సు వస్తుందని వాపోయారు. ఇది ఇలా ఉంటే పరిగి డిపోకు చెందిన బస్సు ఉదయం పూట మదన్ పల్లి నుండి తుంకిమెట్లకు రెండు ట్రిప్పులు తిరిగేది. కానీ ఇప్పుడు ఒకే ట్రిప్పు వస్తుండడంతో ఒకేసారి 200 మందికి పైగా విద్యార్థులు ఆపసోపాలు పడుతూ ఉక్కిరిబిక్కిరితో నిలబడుతూ ప్రయాణం చేస్తున్నారు. అయితే గురువారం బురాన్ పూర్ గ్రామ ప్రజలు, విద్యార్థులు రెండు ట్రిప్పులు నడపాలని, 20 నిమిషాలు బస్సును ఆపి, నిరసన తెలిపారు. అదేవిధంగా మండలంలోని ఏర్పమాళ్ల గ్రామానికి ఒక్కోసారి బస్సు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed