చెల్లి పెళ్లికి భూమి అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన..!

by Mahesh |   ( Updated:2025-03-18 05:35:39.0  )
చెల్లి పెళ్లికి భూమి అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన..!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఆ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలుగా ఏ శాఖకు రాని ఫిర్యాదులు రెవెన్యూశాఖలోనే అత్యధికంగా వస్తున్నాయి. సుమారుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనే 10 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెలలుగా, ఏండ్లుగా అధికారుల వద్ద ఫైళ్లు పెట్టుకొని పరిష్కరించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం సాగుతున్నది.

గత ప్రభుత్వంలో ఏదో ఒకటి సాకు చెప్పి తప్పించుకున్నారనే దుష్ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అధికారులు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌​కు అన్ని ఆప్షన్ల బాధ్యతను అప్పగించడంతో పని భారం పడుతుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆప్షన్లు తీసుకొచ్చి అంశాల వారీగా విభజించారు. అయినప్పటికీ ఆర్డీవో, తహశీల్దార్​ స్ధాయిలో పనులకు పరిష్కారం దొరుకుతున్నప్పటికీ అదనపు కలెక్టర్​, కలెక్టర్ల వద్ద కుప్పలు కుప్పలుగా దరఖాస్తులు పెండింగ్​‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. ఏదో ఒక సమస్య ఉందని అధికారులు సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు.

మూడు వారాల్లో 103 ఫిర్యాదులు..

ప్రతి సోమవారం కలెక్టరేట్​లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి భూ బాధితులకు భారీగా తరలి వస్తున్నారు. మూడు వారాల నుంచి రెవెన్యూ శాఖలో 103 దరఖాస్తులు వస్తే.. ఇతర శాఖల్లో 88 మాత్రమే వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే రెవెన్యూ శాఖలో వచ్చిన 103 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులకు పరిష్కారం దొరికిందో అధికారులకే తెలుసు. గత వారం ప్రజావాణిలో పిర్యాదు చేసిన వ్యక్తి ఈ వారంలో కూడా ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యమేమిటి..? పెండింగ్​‌లోనున్న దరఖాస్తులను పరిశీలించి మండల తహశీల్దార్​ రిపోర్ట్​, ఆర్డీవో రిపోర్ట్​ ఆధారంగా రిజెక్ట్​ లేదా అప్రూవల్​ చేసే అధికారం అదనపు కలెక్టర్​, కలెక్టర్లకు ఉంది. కానీ అవేమీ ఆలోచించకుండా ఒకే దగ్గర పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో భూ బాధితులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– షాద్ ​నగర్​ నియోజకవర్గం జిల్లేడ్​ చౌదరిగూడ మండలం ఎదిరా రెవెన్యూ గ్రామం కాసులబాద్​ వాస్తవ్యులు రామచంద్రం, మల్లయ్యకు సంబంధించిన 0.27 గుంటల చొప్పున భూమి సిలింగ్‌​గా పడింది. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్వే నంబర్​ 84అ2/3,85అ3/2ల్లోని పట్టా భూమిని అధికారులు సీల్లింగ్‌గా వెబ్​ సైట్​లో నమోదు చేశారు. అధికారులు తప్పు చేసినప్పటికీ 2022, మే 28న ధరణి వెబ్​ సైట్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ల్యాండ్​ స్టేటస్​ ను సవరించాల్సిన అధికారులు మూడేండ్లుగా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. మా చెల్లి పెళ్లికి భూమి అమ్ముకుందామంటే.. దరణి దరఖాస్తు రిజక్ట్ ​గానీ, అప్రూవల్ ​గానీ కాకపోవడంతో కలెక్టరేట్​ కార్యాలయం చుట్టూ ఏండ్లుగా తిరుగుతున్నట్లు బాధితుడు వివరిస్తున్నారు.

–కొందుర్గు మండలం అగిర్యాల రెవెన్యూలోని సర్వే నంబర్​ 307 లో ఎకరం వ్యవసాయ సాగు భూమి ఉంది. ఈ భూమి పట్టాగా కాకుండా ఇండ్లు అని తప్పుగా పడింది. ధరణి వెబ్​ సైట్​ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే పడింది. అందుకు సంబంధించిన పహాణీలు, పాత పాస్ బుక్​ అన్ని ధ్రువీకరణ పత్రాలతో ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏడు నెలల నుంచి కాలయాపన చేస్తూ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని ముస్తఫా ఖాన్​ అన్నారు. ఇప్పటికే అనేక మార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు అదనపు కలెక్టర్​ మధ్యాహ్నం 1 గంటకు గది దగ్గర నిలబడితే రాత్రి 8 గంటల వరకు కలుస్తానని చెప్పి నిరీక్షించినట్లు తెలిపారు.

అధికారుల మాటలకే ప్రాధాన్యం..

సామాన్యుడి సమస్యలు పట్టించుకునే అధికారులు కనిపించడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. కలెక్టర్​ అందరినీ కలువడం, బాధితుల బాధలు వినడానికి సమయం ఉండకపోవచ్చు. అదేవిధంగా అదనపు కలెక్టర్‌​ను కలిసి బాధితులు బాధ చెప్పుకోవడానికి సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలను సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడితే క్షేత్రస్థాయిలో అధికారుల మాటలతో ఏకీభవించి అదే సమాధానం చెబుతూ వెనుతిరిగి పంపిస్తున్నారు. కొంతమంది జిల్లా అధికారులు అక్రమాలకు పాల్పడే సిబ్బందిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు జిల్లా అధికారుల మాటలకు సంతృప్తి చెంది వదిలేస్తున్నారు.

రెవెన్యూ శాఖాధికారులు మండల స్ధాయిలో కొంత మంది అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం, రిపోర్ట్​, పంచనామా చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులను రాజకీయ, ఆర్థికంగా ప్రభావం చేసే అక్రమార్కులకే మద్దతు ఇవ్వడం గమనార్హం. సామాన్యుడికి న్యాయం జరగదని ఆవేదన చెందుతూ.. మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరుతో రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధితుల బాధను అర్థం చేసుకొని న్యాయం వైపు అడుగులు వేస్తే అధికారులపై నమ్మకం కలుగుతుందని కలెక్టర్​, అదనపు కలెక్టర్లను కోరుతున్నారు.

Next Story