గంజాయి రాకెట్​ గుట్టు రట్టు

by Kalyani |
గంజాయి రాకెట్​ గుట్టు రట్టు
X

దిశ, బడంగ్ పేట్​ : బాలాపూర్​ పోలీసులు గంజాయి రాకెట్​ గుట్టును రట్టు చేశారు. గంజాయిని సరఫరా చేస్తున్న గంజాయి రాకెట్లోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోషల్​మీడియాను అడ్డుపెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.72 లక్షల 82 వేల విలువైన 9 కిలోల ఎండు గంజాయితో పాటు 170 గ్రాముల ఓజీ గంజాయి, రూ.2.4 లక్షల నగదు, 4 మొబైల్​ ఫోన్లు, మహీంద్రా కారు, స్విఫ్ట్​ కారు, 4 బైక్​లు, ఒక తూకం మిషన్​ ను బాలాపూర్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పహాడీ షరీఫ్​ పోలీస్​ స్టేషన్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్వరం డివిజన్​ డీసీపీ సునీతా రెడ్డి, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్​రెడ్డి, బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ ఎం.సుధాకర్​లతో కలిసి వివరాలు వెల్లడించారు.

ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు బాలాపూర్​లోని విఎన్​ఆర్​ ఏరోసిటి ప్రాంతంలోని బహిరంగ ప్రదేశంలో ఓజీ​ గంజాయి, ఎండు గంజాయి పొడిని సరఫరా చేస్తున్న రాజేంద్రనగర్ హ్యాపి హోమ్స్​ కాలనీకి చెందిన బండారి సునీల్​ అలియాస్​ సులేమాన్​ అలియాస్​ చిన్న (30) , దారుసలాం అఘాపురాకు చెందిన మొహమ్మద్​ అస్లాం (32) , మొహమ్మద్​ అక్రం (30) లను బాలాపూర్​ పోలీసులు రెడ్​ హ్యాండెడ్​గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.72లక్షల 82వేల విలువైన గంజాయి లభ్యమయ్యింది. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. టోలిచౌకి సాలార్​ జంగ్​ కాలనీకి చెందిన మొహమ్మద్​ ఇద్రీస్​ ఖలీమ్​ అలియాస్​ ఫరాఖాన్​ అనే వ్యక్తి కజిన్​ బ్రదర్​ మొహమ్మద్​ అబ్బాస్​ ఓజీ​ గంజాయితో పాటు, ఎండిన గంజాయిని గత కొంత కాలంగా పెద్ద మొత్తంలో సేకరిస్తున్నారు.

3గ్రాములు, 5గ్రాముల ఓజీ గంజాయి ప్యాకెట్​లను, 100 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్​లను తయారు చేసి జూబ్లిహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాలలో అవసరమైన వినియోగ దారులకు అధిక ధరలకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​, మియాపూర్​, ఉప్పల్​, బాలాపూర్​, శంషాబాద్​ ప్రాంతాలలో 3గ్రాముల ఓజి గంజాయి ధర రూ.12వేలు, 5గ్రాముల ఓజి గంజాయి ధర రూ.18వేలు, 100 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్​ ధర రూ.3వేలకు విక్రయిస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారం కోసం బండారి సునీల్​, మొహమ్మద్​ అస్లాం, మొహమ్మద్​ అక్రంలను ఎంచుకున్నారు. స్నాప్​ చాట్​ తో పాటు సోషల్​ మీడియా ద్వారా తమ వినియోగ దారులకు గంజాయి ప్యాకెట్లను సరఫరా చేసి , నగదు రూపంలో గానీ యూపీఐ ద్వారా గాని డబ్బులు వసూలు చేయాలని సూచించారు. డ్రగ్స్​ డెలివరీ చేసే సమయంలో వినియోగదారులతో కమ్యూనికేషన్​ కోసం స్నాప్​ చాట్​, ఇన్​స్ట్రా గ్రామ్​, ఫేస్​ బుక్​ మెసెంజర్​, వాట్సాప్​ల ను ఉపయోగించేవారు.

వినియోగదారులకు డ్రగ్స్​ సరఫరా కోసం వినియోగదారుల లొకేషన్​ను ఈ ముగ్గురికి పంపించే వాడు. లొకేషన్​కు చేరుకున్న అనంతరం క్వాంటిటినీ బట్టి నగదు చెల్లింపులు జరిగాక చాటింగ్​ మెసేజ్​లన్నీ డెలీట్​ చేసేవారు. పరారీలో ఉన్న మొహ్మద్​ ఇద్రీస్​, మొహమ్మద్​ అబ్బాస్​ల కోసం బాలాపూర్​ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న బండారి సునీల్​, మొహమ్మద్​ అస్లాం, మొహమ్మద్​ అక్రంలను సోమవారం రిమాండ్​కు తరలించారు. సునీల్ బండారి చాలా కేసులు ఉన్నాయని, బెంగుళూర్ లో మోస్ట్ వాంటెడ్ అని డిసిపి సునీతా రెడ్డి తెలిపారు. గంజాయి రాకెట్​ గుట్టు రట్టు చూసిన బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ ఎం.సుధాకర్, ఎస్​ఐ శ్రీకాంత్​రెడ్డి​ బృందాన్ని మహేశ్వరం డివిజన్​ డీసీపీ సునీతా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed