పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ

by Mahesh |
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ జరుగుతోంది. రెండవ శనివారం అధికారికంగా సెలవు ఉన్నా బయట నుంచి తాళాలు వేసి లోపల కార్యాలయాలకు సంబంధం లేని వ్యక్తులతో పాటు సిబ్బంది పాల్గొని వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యాలయంలో కొంతమంది కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందితో తమకు నచ్చిన విధంగా పనులు చేసుకునే పనుల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. బయట వ్యక్తులతో కార్యాలయానికి సంబంధించిన వారు కుమ్మక్కై వారికి సహకరిస్తూ ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రేపుతోంది. కొంతమంది ప్రజా ప్రతినిధులు, వారి బంధువులు సైతం శనివారం కార్యాలయానికి చేరుకొని త్వరలో జరగబోయే మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన పలు వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా కిందిస్థాయి సిబ్బంది చేయడం చూస్తుంటే పై అధికారులకు విషయం తెలుసా లేదా కార్యాలయంలో ఏం జరుగుతోంది అన్న ఆసక్తి నెలకొంది. ఈ విషయమై సంబంధిత ఇన్చార్జి కమిషనర్ ను వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా సెలవు రోజుల్లో బయటకు తాళాలు వేసుకుని చక్కగా విధులు నిర్వహిస్తున్నారు అంటే ఎటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయో ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. ఈ ఒక్క రోజే గాక ప్రతిరోజు కూడా రాత్రి 12 గంటల వరకు కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులతో కొంతమంది సిబ్బంది, అధికారులు తమ కావాల్సిన విధంగా వ్యవహారాలు చక్క దిద్దుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Next Story