ప్రజల ప్రాణాలతో చెలగాటాలా..?

by sudharani |   ( Updated:2022-12-23 14:51:26.0  )
ప్రజల ప్రాణాలతో చెలగాటాలా..?
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి కమల నగర్ కాలనీలో నిర్మించిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని.. అనువైన స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు పత్య నాయక్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోళీ శ్రీనివాస్ రెడ్డి, కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్, పాక్స్ చైర్మన్ గంప వెంకటేష్ మద్దతు తెలిపారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పక్కన చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్‌తో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపాలిటీ పాలకవర్గం నిర్లక్ష్యంతో కాలనీవాసులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు.

పత్య నాయక్ మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన పొగతో నెలల కాలంగా ప్రజలు వేదనకు గురవుతున్నారన్నారు. డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని మున్సిపాలిటీ పాలకవర్గము అధికారులను ఎంతో కాలంగా ఫిర్యాదులు అందజేస్తున్న చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీవాసులకు ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్‌ను తొలగించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మండల అధ్యక్షులు అర్జున్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నిట్ట నారాయణ, ఎంపీటీసీ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, నాయకులు అప్పం శ్రీను, ఖలీల్, రామకృష్ణ, బాలస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story