- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌పై కంప్లైంట్... సీరియస్ అయిన రాహుల్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ ఎదుట మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులపై రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా రాష్ట్ర నేతలతో మూడు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీనియర్లు విమర్శలు చేశారు. ముందుగానే టికెట్ల పంచాయతీ ముందుకు తెచ్చారు. పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డితో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థులను ప్రకటించుకునే అవకాశం ఇచ్చారా అని, తన పార్లమెంట్ పరిధిలో కూడా అభ్యర్థులను ప్రకటించుకుంటామన్నారు. కొన్ని జిల్లాలకు వెళ్లి టికెట్ ఇస్తామంటూ చెప్పుతున్నారన్నారు. దీనిపై మాణిక్కం ఠాగూర్ సర్ధి చెప్పుకొచ్చారు. అభ్యర్థుల ప్రకటనపై రాహుల్ గాంధీ కూడా స్పష్టతనిచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటిస్తామని, , అభ్యర్థుల జాబితాను తానే విడుదల చేస్తానని రాహుల్ వెల్లడించారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పోరాడాలని, మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిలో మాట్లాడవద్దని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, ఏదైనా ఉంటే తనతో లేదా కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడాలని, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
మేం ఉన్నామా..? లేమా?
రాహుల్‌తో సమావేశంలో రేవంత్ వ్యతిరేకవర్గం పలు ఆరోపణలకు దిగారు. జిల్లా పర్యటనల సందర్భంగా కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని, తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండానే పలు కార్యక్రమాలను ప్రకటిస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో పార్టీ నేతల్లో సయోధ్య లేదనే అంశం బహిరంగమవుతుందని రాహుల్ ముందు వెల్లడించారు.
కోవర్టులెవ్వరు
రాహుల్ ఎదుట కాంగ్రెస్ కోవర్టులెవ్వరనే అంశంపై సీరియస్‌గా వాదనలు జరిగినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. రేవంత్ వర్గం పదేపదే కాంగ్రెస్ పార్టీ కోవర్టులంటూ కొంతమందిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుందని, దీన్ని కట్టడి చేయడంలోనూ రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారంటూ వివరించారు. తాను పార్టీ కోసం పని చేస్తున్నానని, సోనియా కుటుంబానికి విధేయుడిననంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాలో పార్టీ కార్యక్రమం గురించి చెప్పడం లేదని ఆరోపించారు. పార్టీ సీనియర్లు గాంధీభవన్‌కు కూడా రావడం లేదన్నారు. తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారంటూ ఎంపీ ఉత్తమ్ కూడా అధినేత ముందు వివరించారు. ఇక సీనియర్లను పట్టించుకోవడం లేదని, సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పొరపాట్లు జరుగుతున్నాయి
తాను టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచి తనపై విమర్శలు ఆగడం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తాను కలిసిపోయేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు జరిగాయని, ఇక నుంచి అలాంటివి జరుగవని రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.
విభేదాలు కాదు.. కలిసికట్టుగా పని చేయాలి
రాష్ట్ర నేతలందరీ అభిప్రాయాలు విన్న తర్వాత రాహుల్ గాంధీ సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీలో విభేదాలన్నీ పక్కన పెట్టాలని, ప్రజా సమస్యలే ఎజెండాగా నిరసనలు చేయాలని సూచించారు. ముందుగా పార్టీ నేతలంతా ఒక్కటే అనే విధంగా అంతా వ్యవహరించాలని, అందరు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని, అప్పుడే రచ్చ గెలుస్తామంటూ సూచించారు. పార్టీలో ఇలాంటి అసంతృప్తి సాధారణమని, కానీ ఏదైనా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బహిరంగంగా మీడియాకు రావద్దన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నారని, వారందరినీ సమీకరించుకుని ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని రాహుల్ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా తమ వ్యూహకర్తలతో సర్వే చేయించామని సైతం నేతలకు వివరించారు.
పొత్తు ఉండదు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల టీఆర్ఎస్, ఎంఐఎంతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని నేతలు రాహుల్ కు వివరించడంతో.. ఎవరితోనూ పొత్తు అనేది ఉండదని తేల్చి చెప్పారు. పార్టీలో నేతలంతా కష్టపడితే ఒంటరిగా అధికారంలోకి వస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ కోసం కష్టపడే వారి వివరాలన్నీ సేకరిస్తున్నామని, ఈసారి ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే టికెట్లు ఇస్తామని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని రాహుల్ స్పష్టం చేశారు.
ఎన్నిసార్లు పిలిచినా వస్తా
ఇటీవల ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపట్టే నిరసనల్లో తాను కూడా హాజరవుతానని వెల్లడించారు. ఎన్నిసార్లు రాష్ట్రానికి రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, పార్టీ తీసుకునే నిరసనల్లో తాను పాల్గొంటానని, జాయింట్‌గా నేతలంతా రమ్మంటే వస్తానన్నారు.
ఈయనే సునీల్
సమావేశం అనంతరం రాహుల్ గాంధీ.. తెలంగాణ వ్యూహకర్త సునీల్‌ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. సునీల్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వ్యూహకర్తగా ఉంటారని, ఇక నుంచి పలు అంశాల్లో ఆయన పార్టీకి సేవలందిస్తాడని సూచించారు. ఇప్పటికే కొన్ని అంశాలపై రాష్ట్రం నుంచి సునీల్ నివేదిక తీసుకున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఈ సందర్భంగా 39 మంది నేతలకు సునీల్‌ను పరిచయం చేశారు.
ఐక్యమత్యంతో పోరాటం
తెలంగాణలో తాజా పరిస్థితులపై రాహుల్‌తో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. రాహుల్‌తో భేటీ అయిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ విభేదాలు వీడి ప్రజాసమస్యలపై పోరాడాలని రాహుల్ సూచించారని, తెలంగాణ సమాజాన్ని టీఆర్ఎస్, బీజేపీ విభజిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామని, క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నేతలందరికీ రాహుల్ గాంధీ దిశానిర్ధేశం చేశారని, కాంగ్రెస్‌కు శషబిషలు లేవని, కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు అందరూ ఒకే గొంతుకై పోరాటం చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి గడప తడుతామని, రాహుల్ గాంధీ సమక్షంలోనే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తారన్నారు.
అందుకే బయటకు వచ్చా
సమావేశంలో పార్టీ టికెట్ల అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... మధ్యలోనే బయటకు రావడంపై కొంత అనుమానాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వర్సిటీలో తెలుగు విద్యార్థుల భేటీ కోసం వచ్చానన్నారు. పార్టీ బలోపేత, టీపీసీసీ చీఫ్ వ్యవహారంపై రాహుల్‌తో మాట్లాడానని, అంతా కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.
గతం కాదు.. ఇప్పుడు కలిసి పోరాడుతాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున టికెట్లు ఎవరికనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని, పార్టీలో ఉన్న వివాదాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని ఎంపీ ఉత్తమ్ వెల్లడించారు. ఇక నుంచి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తామని నిర్ణయం తీసుకున్నామని, టీఆర్ఎస్, బీజేపీని ఓడించి తెలంగాణలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి వస్తానన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, రాహుల్ సూచనలతో పార్టీ నేతలంతా కలిసి పని చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రానికి రావాలని ఆహ్వానించామని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్ ఒప్పుకున్నారు.
సోనియాతో వీహెచ్ భేటీ
తెలంగాణలోని పలు రాజకీయ అంశాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించానని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ముందుగా సోనియా గాంధీతో దాదాపు అరగంట సేపు ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనా సందర్భంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సందర్భంలో సోనియాగాంధీ తనకు ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారన్నారు. తెలంగాణ రైతుల సమస్యలను సోనియాగాంధీకి వివరించానని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని సోనియాకు తెలిపానన్నారు.
కలిసి వచ్చేనా..?
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ ఫోకస్ పెట్టారు. ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉండటంతో.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు అంతర్గత విభేదాలు పక్కన పెట్టాలని, అలా అయితే అధికారం మనదేననే ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై ఆయన తెలుగులో చేసిన ట్వీట్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. త్వరలో ఇదే అంశంపై నిరసనకు కూడా వస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో రాహుల్ ఫోకస్ స్పష్టమవుతోంది. ఇప్పటి వరకూ తలొదిక్కుగా కొట్టుకుంటున్న నేతలు.. ఇప్పుడైనా కలిసి వస్తారా.. అనేది పార్టీలో చర్చగా మారింది.