మైనింగ్‌‌లో ప్రక్షాళన! అవినీతి ఆరోపణలు రావడంతో ఇమీడియట్ యాక్షన్స్

by Rajesh |
మైనింగ్‌‌లో ప్రక్షాళన!  అవినీతి ఆరోపణలు రావడంతో ఇమీడియట్ యాక్షన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల నుంచి మైనింగ్ శాఖపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఈ నెల 16న సచివాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించిన సీఎం..రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో పనిచేయాలని, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు. ప్రతినెలా టార్గెట్ సాధించాలన్నారు. అయితే కొందరు ఆఫీసర్లపై ఆరోపణలు రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. అందులో భాగంగానే సీఎం సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే గనులు, భూగర్భ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను బదిలీ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

శాఖలోని అధికారులపై లీక్ ఆరోపణలు

మైనింగ్‌ శాఖలో జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు కొందరు అధికారులు లీక్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటే తప్ప మార్గం లేదని భావించిన ప్రభుత్వం అధికారుల బదిలీలకు దారి తీసినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు శాఖలోని కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వారిపై వేటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఆరుగురు ఆఫీసర్లపై బదిలీ వేటు వేసినట్టు సమాచారం. మరికొందరిపైనా చర్యలకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే వారి డేటాను ప్రభుత్వం సేకరించినట్టు తెలుస్తోంది.

2015లో నూతన ఇసుక పాలసీ..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో టీఎస్‌ఎండీసీలో నూతన ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది. పాలసీని పటిష్ఠంగా అమలు చేసేందుకు చాలా మంది ఇతర శాఖలకు చెందిన అధికారులు టీజీఎండీసీలో డిప్యూటేషన్‌లో పనిచేశారు. సహకార శాఖ నుంచి టీఎస్‌ఎండీసీలో డిప్యూటేషన్‌పై పనిచేసిన కొందరు ఆఫీసర్లపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ప్రభుత్వం ఆరోపణలు వచ్చిన అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇతర శాఖల నుంచి తిరిగి డిప్యూటేషన్‌పై కొందరు అధికారులకు టీఎస్‌ఎండీసీలో పోస్టింగులు ఇచ్చింది. ప్రస్తుత బదిలీలతో 2015కు ముందున్న పరిస్థితి టీజీఎండీసీలో నెలకొంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

సొంత శాఖలకు ఆఫీసర్ల బదిలీ

తెలంగాణ గనులు, భూగర్భ శాఖలో డిప్యూటేషన్‌ పనిచేస్తున్న ఆరుగురు అధికారులపై వేటు వేసింది. తిరిగి వారి సొంత శాఖలకు బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో పాటు దీర్ఘకాలికంగా పనిచేస్తుండటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముగ్గురు జనరల్‌ మేనేజర్లు, మరో ఇద్దరు ప్రాజెక్టు ఆఫీసర్లు, ఒకరు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో బదిలీ వేటు పడింది. వారిలో దేవేందర్‌రెడ్డి, ప్రశాంతి పంచాయతీరాజ్‌ శాఖలో డిప్యూటీ సీఈవోలుగా ఉన్నారు. పాండురంగారావు ఆడిట్‌ విభాగం అధికారి కాగా ఆయన టీజీఎండీసీలో జనరల్‌ మేనేజర్‌ హోదాలో పనిచేస్తున్నారు. మైన్స్‌ అండ్‌ జియాలజీ విభాగానికి చెందిన దశరథం నాయక్‌, శ్రీనివాస్‌, రెవెన్యూ విభాగానికి చెందిన తోట శ్రీధర్‌ కూడా టీజీఎండీసీలో డిప్యూటేషన్‌పై ప్రాజెక్టు అధికారులుగా పనిచేశారు.

నెలల వ్యవధిలోనే ముఖ్య కార్యదర్శి బదిలీ

గనులు, భూగర్భ వనరుల విభాగంలో మొదటి సారి నెలల వ్యవధిలోనే ముఖ్యకార్యదర్శిని ప్రభుత్వం మార్చడం ద్వారా ఆ శాఖపై ఏ మేరకు దృష్టి సారించిందనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జనవరి 3న గనులు, భూగర్భ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ఐదు నెలలు పూర్తికాకముందే ఈ నెల 17న ఆయనపై బదిలీ వేటు వేసింది. సాధారణ పరిపాలన విభాగంలో (జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గతంలో గవర్నర్‌ కార్యదర్శిగా పనిచేసిన సురేంద్ర మోహన్‌కు గనుల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో ఆరుగురు అధికారులపైనా బదిలీ వేటు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల్లోనూ చర్చనీయాంశమైంది. ఇంకా ఎవరిపైనా వేటుపడుతుందోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed