- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌పై ఎక్కడికక్కడ జనాగ్రహం.. సొంత నియోజకవర్గాల్లో మంత్రులకు చుక్కలు!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తమ మౌలిక సమస్యలు పరిష్కరించడం లేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కావడం లేదని ఫైర్ అవుతున్నారు. పర్యటనకు వెళ్లిన మంత్రులను ఘెరావ్ చేస్తున్నారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. సొంత నియోజకవర్గాల్లోనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నుంచి సర్పంచ్ వరకు ఎవరిని వదలడం లేదు. సమస్యలు పరిష్కరిస్తారా..? లేదా చెప్పాలని నిలదీస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాదు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితే నెలకొంది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటింది. అయినా మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో హామీలు సైతం ఇచ్చినప్పటికీ అవి అమలు కాకపోవడం, రోడ్లు, భవనాలు అసంపూర్తిగా ఉండటం, తాగునీరు సైతం సరఫరా కాకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ లతో పాటు అధికారులను సైతం నిలదీస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే లను సైతం అడ్డుకుంటున్నారు. మంత్రు లను సైతం వదలడం లేదు. సీఎం కేసీఆర్ సైతం జిల్లాల్లో సమీకృత భవనాలు ప్రారంభోత్సవ సమయంతో పాటు ఈ నెల 17న జరిగిన గిరిజన, ఆదివాసీ భవనాల ప్రారంభోత్సవం రోజూ గిరిజనులే కాన్వాయ్ కి అడ్డు పడ్డారు. అంటే ప్రతి వర్గంలో ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది.
సమస్యలపై నిలదీత..
మంత్రులకు సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్డుకుంటున్నారు. రోడ్డు, తాగునీరు, ఇతర మౌలిక సమస్యలను పరిష్కరించే వరకు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 20న మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లో మంగళవారం పర్యటించారు. కొండపాక, ఖమ్మంపల్లి గ్రామాల్లో అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రజలు యత్నించారు. ఇది మంత్రికి ఊహించని పరిణామం.
మంత్రి సత్యవతి రాథోడ్ కు సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల20న ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిని టీఆర్ఎస్ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో గట్టమ్మ దగ్గర అడ్డుకున్నారు. కాన్వాయికి అడ్డంగా కూర్చొని ములుగు గడ్డపై అడుగుపెట్టొద్దని నినాదాలు చేశారు. కాళ్లు పట్టుకొని దళితులను న్యాయం చేయాలని, అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని వేడుకున్నారు. ఎంపీ కవిత ఎన్నికల్లో కార్యకర్తలకు ఏమీ చేశారు.. మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. జూన్ 15న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను కొందరు యువకులు అడ్డగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జూన్ 10న జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళ్లారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం, చెరుకు రైతులను ఆదుకోకపోవడంతో చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి ఆగ్రహించి కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పు విసిరాడు. అరెస్ట్ చేయడం పై ఆగ్రహం రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 11న ఖమ్మం జిల్లా పర్యటనలోనూ కేటీఆర్ కు నిరసన తప్పలేదు. నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
జూన్ 21న జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి లోని కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)కి మంత్రి కేటీఆర్ వచ్చే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపై, దుకాణాలపై యువత నిల్చుని నిరసన ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేటీఆర్ వచ్చే మార్గంలో డివైడర్ పైన బ్యానర్లను కట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని.. అభివృద్ధి అంటే ఇదేనా...? అని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా జూలై 31న నారాయణపేట జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కు యువత నిరసన తెలిపారు. అదే విధంగా సీఎం కేసీఆర్ కు నిరసన తాకుతోంది. సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ సమీకృత భవనాలకు వెళ్లిన కేసీఆర్ కాన్వాయిని విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకునే ప్రయత్నం ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో లాఠీచార్జ్ చేశారు.
ఆగస్టు 16న.. వికారాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ కు నిరసన సెగ ఎదురైంది. రాష్ట్ర అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద సీఎం గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఇక్కడ కు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 21న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వీపనగండ్ల మండలం గోవర్దనగిరి, గోపాల్ దిన్నె గ్రామాల గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. గత 6 ఏళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డు సమస్యకు పరిష్కారం చూపే వరకు కదలనివ్వబోమని భీష్మించడంతో చేసేదేమీలేక వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పలు ఘటనలు..
గతంలోనూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామంలో మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. పల్లె ప్రగతి గ్రామ సభలో మహిళలు సమస్యల పై గొంతెత్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి సొంత గ్రామం నాగారం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎంపీపీ, సర్పంచ్‌లపై స్థానికులు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి లో కొత్తగా నిర్మించబోతున్న రాచకొండ కమిషనరేట్‌లో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి ని దళిత రైతులు అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ను సైతం గ్రామాల్లో ప్రజలు సమస్యలపై నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, గ్రామస్తులు రాజీనామా చేశారు.
మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఖాళీ బిందెలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాధపురం తూర్పు బజార్ లో రావడం లేదు. దీంతో మంగళవారం దమ్మపేట- పాల్వంచ రోడ్డుపై నిరసన. కార్యదర్శిని ఘెరవ్ చేశారు. ఎన్నికలప్పుడు ఊరికి రోడ్డు వేయిస్తమని. గెలిచిన తర్వాత మరిచిపోయారని వానలకు రోడ్లు తెగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట గ్రామస్తులు నిరసన తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో వేములవాడ కోరుట్ల హైవేపై ధర్నా చేశారు.
నిజామాబాద్‌లోని నిజాంసాగర్ మండలం పిప్పిరేగడి తండావాసులు ఎల్లారెడ్డి-నిజాంసాగర్ మెయిరోడ్డుపై ధర్నా చేశారు. సమస్యల పై గొంతెత్తారు. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంటకు చెందిన అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆరోపించారు. సర్పంచ్ సున్నం సరస్వతి, ఉప సర్పంచ్ జుజ్జూరు రాంబాబు, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, మాజీ ఎంపీటీసీ తిరుపతమ్మ, విద్యాకమిటీ చైర్మన్ మాడి ముత్యాలరావు, వార్డుసభ్యులు నాగచెన్నారావు, సుధ, విజయకుమారి, వాణి, తిరుపతమ్మ, సొసైటీ డైరక్టర్ పుల్లమ్మ టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
ముందస్తు అరెస్టులు..
సీఎం, మంత్రులు పర్యటనను పురస్కరించుకొని ముందస్తుగానే పోలీసులను అరెస్టు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన నేతలను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ఆ జిల్లాలో ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా కొన్ని ఘటనలు జరిగితే ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై మాత్రం దృష్టి సారించడం లేదు.
అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి..
ప్రభుత్వం ప్రజలకు హామీలు గుప్పిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, నిధుల కొరతతో పథకాలు ముందుకు సాగకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రైతులకు రుణమాఫీ కాకపోవడం, కొత్త పింఛన్ దారులకు కార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడం, రేషన్ కార్డులు పెండింగ్ లో ఉండటం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లతోనే ఊరిస్తుండటం, డబుల్ బెడ్రూం ఇళ్లను అందరికి ఇవ్వకపోవడం, పోడు భూముల సమస్య పెండింగ్ లోనే ఉండటం, ప్రాజెక్టు ముంపు బాధితులకు పునరావాసం కల్పించడంలో జాప్యం, గ్రామాల్లో మౌలిక సమస్యలు తిష్ఠ, ఉద్యోగుల్లో ప్రమోషన్లు, పీఆర్సీ ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమవుతుండటంతో అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేక మొదలైంది. కొన్నింటిలో ప్రభుత్వం సఫలమైనప్పటికీ మెజారిటీ హామీలు నెరవేరక పోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమయానుకూలంగా మంత్రులను, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి.
Also Read: బెడిసికొట్టిన మంత్రి అత్యుత్సాహం.. శ్రీనివాసగౌడ్‌కు మరో బిగ్ షాక్!
Also Read: ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఆ దమ్ము లేదంటున్న కేటీఆర్