ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ సెలవులు అమలు చేయాలి : తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం

by M.Rajitha |
ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ సెలవులు అమలు చేయాలి : తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ సెలవులు, విద్యాశాఖ నిర్దేశించిన పనివేళలు కచ్చితంగా అమలుచేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం(టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈమేరకు.. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయన శుక్రవారం సీఎంవో, ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్, కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రవేట్ స్కూల్స్ లో రెండో శనివారం సెలవు అమలుచేయడం లేదని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా స్కూళ్లను కొనసాగిస్తున్నారని, అయినా విద్యాశాఖ అధికారులు తమకు ఏమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్యకు తోడు ప్రైవేట్ స్కూళ్లలో విద్యాశాఖ నిర్దేశించిన పని వేళలు అమలుకావడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే.. విద్యాశాఖాధికారుల చిత్తశుద్ధిని శంఖించాల్సి వస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శాఖ రిలీజ్ చేసిన ఉత్తర్వులను ఆ శాఖ అధికారులే తుంగలో తొక్కడం బాధాకరమని చెప్పుకొచ్చారు. గతంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, అందుకే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఫిర్యాదు చేశామని షబ్బీర్ అలీ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, విద్యాశాఖ ఆదేశాలను అమలయ్యేటట్లు చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరుపమ సంజయ్, నాయకులు శివరాజ్, నవీన్ కుమార్ గౌడ్, అమీరుద్దీన్, లత, రాజు, వెంకన్న, మహేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Next Story