‘డబుల్ ఇళ్ల కాలనీల్లో సదుపాయాలు కల్పించండి’

by Rajesh |
‘డబుల్ ఇళ్ల కాలనీల్లో సదుపాయాలు కల్పించండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వం నిర్మించిన 65 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు తగిన సదుపాయాలు కల్పించి ఇళ్లను స్వాధీనం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ధర్నా చౌక్‌లో సీపీఎం నిర్వహించిన ధర్నాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కరెంటు రోడ్డు లిఫ్ట్‌లో ఏర్పాటు లేకపోవడంతో ఇల్లు పొందిన పేదలు ఆ ఇళ్లలో నివసించే పరిస్థితి లేదని, తక్షణమే సదుపాయాలు కల్పించాలని నాగేశ్వర్ డిమాండ్ చేశారు. సదుపాయాల కల్పనకు రూ.700 కోట్లు అవసరమని జీహెచ్ఎంసి, హౌసింగ్ అధికారులు తెలియజేస్తున్నందున రాబోయే రాష్ట్ర బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చాలా జాప్యం చేసిందని కనీస సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ఇళ్ల కేటాయింపు జరిపిందని దీని కారణంగానే పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ చెప్పారు. సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో లబ్ధిదారులందరినీ సమీకరించి పెద్దయిత ఆందోళన చేపడుతామని నేతలు ఉద్ఘాటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఎం దశరథ్, ఎం మహేందర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నగర కార్యదర్శి కే నాగలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు వి. విజయకుమార్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లబ్ధిదారుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed