IPhone 16: దేశీయంగా ఐఫోన్ 16 ప్రో సిరీస్‌ తయారీ ప్రారంభించనున్న ఫాక్స్‌కాన్ ఇండియా

by S Gopi |
IPhone 16: దేశీయంగా ఐఫోన్ 16 ప్రో సిరీస్‌ తయారీ ప్రారంభించనున్న ఫాక్స్‌కాన్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ దేశీయంగా తన ఫ్యాక్టరీలో ఐఫోన్ కొత్త సిరీస్ 16 ప్రో తయారీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం 31.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 267 కోట్లు) విలువైన పరికరాలను కొనుగోలు చేసింది. తమిళనాడులో ఉన్న ఫాక్స్‌కాన్ యూనిట్‌లో ఐఫోన్ 16 ప్రో సిరీస్ తయారీని కంపెనీ ప్రారంభిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. యాపిల్ కంపెనీ హై-ఎండ్ ఐఫోన్ ప్రో సిరీస్‌ను చైనా కాకుండా మరో దేశంలో తయారు చేయడం ఇదే మొదటిసారి. యాపిల్ ఆపరేషన్స్ నుంచి సబ్సిడరీ ఫాక్స్‌కాన్ హాన్ హో టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ పరికరాలను అందుకున్నట్టు ఫాక్స్‌కాన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో యాపిల్ తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సిరీస్‌లను త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డివైజ్‌లను ఈ నెలాఖరు లేదా నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 20న భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గింపు కారణంగా కంపెనీ మొదటిసారి ఐఫోన్ ప్రో సిరీస్‌ను మునుపటి కంటే తక్కువ ధరకు విడుదల చేసింది. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ప్రారంభ ధరలు రూ. 1,34,900, రూ. 1,59,900గా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed