Minister Narayana:రెండు రోజుల్లో భ‌వ‌న నిర్మాణాల‌కు కొత్త రూల్స్ జారీ చేస్తాం!

by Jakkula Mamatha |
Minister Narayana:రెండు రోజుల్లో భ‌వ‌న నిర్మాణాల‌కు కొత్త రూల్స్ జారీ చేస్తాం!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ పెర‌గాల‌నేది సీఎం చంద్రబాబు ల‌క్ష్య‌మ‌ని.. దానిక‌నుగుణంగానే నిబంధ‌న‌లు స‌ర‌ళ‌త‌రం చేస్తున్నామ‌ని మంత్రి నారాయ‌ణ‌(Minister Narayana) తెలిపారు. విజ‌య‌వాడ పిన్న‌మ‌నేని పాలిక్లినిక్ రోడ్ లో ఉన్న రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ(రెరా) కార్యాలయంలో మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి, రెరా ఛైర్మ‌న్ క‌న్న‌బాబు, రెరా స‌భ్యులు, అధికారుల‌తో క‌లిసి మంత్రి ఈ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించారు. క్రెడాయ్, న‌రెడ్కో ప్ర‌తినిధుల‌తో పాటు బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్ర‌జ‌ల నుంచి మంత్రి నారాయ‌ణ స్వ‌యంగా విన‌తులు స్వీక‌రించారు. ప్ర‌తి ద‌ర‌ఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివ‌రాలు అడిగి తెలుసుకోవ‌డంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో అధికారుల‌ను వివ‌ర‌ణ అడిగారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భ‌వ‌నాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్ర‌క‌ట‌న‌లు చూసి మోస‌పోకుండా ఉండేలా చూడ‌ట‌మే రెరా ల‌క్ష్యం అన్నారు. కేంద్ర చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్రంలో 2016లో రెరా చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి కేంద్రం ఇచ్చిన నిబంధ‌న‌లు రాష్ట్రంలో తూ.చ‌ త‌ప్ప‌కుండా అమ‌లుచేసేలా ముందుకెళ్తున్నామ‌న్నారు.

రెరాలో ఇప్ప‌టివ‌ర‌కూ 167 ద‌ర‌ఖాస్తులు వివిధ కార‌ణాల‌తో పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఈ రోజు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించామని తెలిపారు. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి 30 మంది క్ల‌యింట్లు,బిల్డ‌ర్లు,డెవ‌ల‌ప‌ర్లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వ‌చ్చారు. ఆయా ద‌ర‌ఖాస్తుల కు సంబంధించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేసాం.పెండింగ్ అప్లికేష‌న్లు అన్నీ ఈ నెలాఖ‌రులోగా క్లియ‌ర్ చేస్తాం.ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలీంచాం. గ‌త ప్ర‌భుత్వంలో బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లుతో పాటు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు,ప్ర‌జ‌లు ఎంతో ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ పెర‌గాల‌నేది సీఎం చంద్ద‌ర‌బాబు ల‌క్ష్య‌మ‌ని, అందుకు అనుగుణంగా భ‌వ‌న‌,లేఅవుట్ల అనుమ‌తులను స‌ర‌ళ‌త‌రం చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించి కొత్త‌గా రూపొందించిన నిబంధ‌న‌ల‌ను వ‌చ్చే గురువారం జారీ చేస్తామ‌ని మంత్రి చెప్పారు. బిల్డ‌ర్లు ప్రభుత్వానికి స‌హ‌కరించాల‌ని కోరారు.

ఈ నెలాఖ‌రులోగా పెండింగ్ టీడీఆర్ బాండ్లు అన్నీ జారీ చేస్తాం..

త‌ణుకు, తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్ర‌మాలు జ‌ర‌గ‌డంతో వాటితో పాటు కొన్నాళ్ల‌పాటు అన్నిచోట్లా బాండ్ల జారీ నిలిపివేసాం అన్నారు. తాజాగా ఒక‌ట్రెండు చోట్ల మిన‌హా మిగిలిన అన్నిచోట్లా పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల‌ను జారీ చేస్తున్నామ‌న్నారు. గ‌త మూడు రోజులుగా ప్ర‌తి రోజూ అన్ని మున్సిపాల్టీల క‌మిష‌న‌ర్ ల‌తో టీడీఆర్ బాండ్ల జారీపై వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. త‌ణుకులో టీడీఆర్ కుంభ‌కోణంపై విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వాటిలో 321 టీడీఆర్ ల వెరిఫికేష‌న్ పూర్త‌యింద‌ని.. మ‌రో 501 టీడీఆర్ ల వెరిఫికేష‌న్ జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలో 184,తిరుప‌తిలో 153,క‌ర్నూలు లో 93,గుంటూరులో 120,కాకినాడ‌లో 91,రాజ‌మండ్రిలో 50,క‌డ‌ప‌లో 46,విజ‌య‌వాడ‌లో 30తో పాటు ఇత‌ర కార్పొరేష‌న్ ల‌లో మ‌రికొన్ని పెండింగ్ లో ఉన్నాయ‌న్నారు. మొత్తంగా 822 టీడీఆర్ ల‌కు సంబంధించి ఈనెలాఖ‌రుక‌ల్లా జారీ ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని మంత్రి నారాయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed