బారామతిలో మళ్లీ ప‘వార్’

by Mahesh Kanagandla |
బారామతిలో మళ్లీ ప‘వార్’
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి ఫ్యామిలీ వార్ జరగనుంది. బారామతి నుంచి అజిత్ పవార్ బరిలో ఉండగా తాజాగా శరద్ పవార్ ఎన్సీపీ శిబిరం ఇక్కడి నుంచి తమ అభ్యర్థిగా యుగేంద్ర పవార్ పేరును ప్రకటించింది. అజిత్ పవార్ తమ్ముడు శ్రీనివాస్ పవార్ కొడుకే యుగేంద్ర పవార్. దీంతో బారామతిలో ఈ సారి పెద్దన్నాన్న వర్సెస్ అబ్బాయి పోరు జరగనుంది.

బారామతి నుంచి అజిత్ పవార్ ఒకసారి ఎంపీగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదు సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్‌కు బారామతిపై మంచి పట్టున్నది. గత లోక్ సభ ఎన్నికల్లో శరద్ పవార్ తనయ సుప్రియా సూలేపై అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్‌ను పోటీగా దింపారు. సుప్రియా సూలేపై ఆమె ఓడిపోవడంతో ఆమెను రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు అజిత్ పవార్‌పై సోదరుడి కొడుకును బరిలో నిలబెట్టి శరద్ పవార్ మరోసారి పవార్ ఫ్యామిలీ వార్‌కు తెరతీశారని అంటున్నారు.

ఈ పరిణామంపై యుగేంద్ర పవార్ మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల్లో సుప్రియా సూలేపై సునేత్ర పవార్‌ను బరిలోకి దింపడం దురదృష్టకరం. ఒక్కసారి విడిచిన బాణం తిరిగి రాదు. బాణం ఎక్కుపెట్టేటప్పుడే జాగ్రత్త వహించాలి’ అని యుగేంద్ర పవార్ అన్నారు. బారామతిలో తాగు నీటి సమస్య, అవినీతి, నేరాలు పెరగడం, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు పెరగడం, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని యుగేంద్ర అన్నారు. శరద్ పవార్ సాహెబ్ మార్గదర్శకత్వంలో ఇక్కడి సమస్యల పరిష్కారానికి పని చేస్తామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed