Dana Cyclone: బెంగాల్, ఒడిశాలు అలర్ట్

by Mahesh Kanagandla |
Dana Cyclone: బెంగాల్, ఒడిశాలు అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: గంటకు 120 కిలోమీటర్ల వేగంతో శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలో తీరం దాటనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నుంచి ఒడిశా 3.5 లక్షల మందిని, బెంగాల్ 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దానా తుఫాన్ ఈ రెండు రాష్ట్రాలపై పంజా విసరనుంది. గురువారం సాయంత్రానికే ఉభయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలను నిలిపేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ట్రైన్ సేవలను ఆపేశారు.

ధమ్రా పోర్ట్, భితర్కనిక నేషనల్ పార్క్‌ల గుండా తుఫాన్ తీరం దాటనన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ బెంగాల్ జిల్లాలైన కోల్‌కతా, హౌరా, హుగ్లి, 24 పరగణాల జిల్లాల్లో గురువారం సాయంత్ర నుంచే భీకర గాలులతో వర్షాలు మొదలయ్యాయి. ఈ ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 48 గంటలపాటు భారీ కుండపోత పడనుందని వివరించింది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లను పర్యవేక్షించే సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ ఈ నెల 23 నుంచి 27 మధ్య ప్రయాణించనున్న170 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేసింది. హౌరా డివిజన్‌లో శుక్రవారం ఉదయానికిగాను 68 సబ్అర్బ్ ట్రైన్లను రద్దు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన సేవలను నిలిపేశారు.

ఒడిశా విషయానికి వస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే 203 ట్రైన్లను రద్దు చేసింది. బుబనేశ్వర్ ఎయిర్‌పోర్టులో విమాన సేవలను గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిలిపేశారు. 23, 24,25వ తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed