Budget : రాష్ట్ర బడ్జెట్‌‌లో ఆ నాలుగింటికి ప్రయారిటీ.. పెండింగ్ ప్రాజెక్టులకూ నిధులు!

by Rajesh |   ( Updated:2024-07-23 02:05:13.0  )
Budget : రాష్ట్ర బడ్జెట్‌‌లో ఆ నాలుగింటికి ప్రయారిటీ.. పెండింగ్ ప్రాజెక్టులకూ నిధులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ బడ్జెట్‌ను ఎల్లుండి అసెంబ్లీలో రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టనున్నది. ఇందుకు ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ ఈ రంగాలకు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. ఆరు గ్యారంటీలు, సంక్షేమం, ఉద్యోగాల భర్తీ తదితర హామీలతోనే అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ ఓపెన్‌గానే చెప్పింది. తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్‌లో సైతం వాటికి ప్రాధాన్యత తగ్గొద్దని ప్రభుత్వం భావిస్తున్నది.

మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కన్నా ఈసారి ఈ నాలుగు రంగాలకు కేటాయింపులు ఏ మేరకు పెరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున స్పష్టమైన హామీలను సైతం బడ్జెట్‌లోనే వెల్లడించే చాన్స్ ఉన్నది. వాస్తవిక బడ్జెట్‌నే రూపొందిస్తున్నామని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా నొక్కిచెప్పిన డిప్యూటీ సీఎం (ఆర్థిక మంత్రి బాధ్యతలు కూడా) భట్టి విక్రమార్క... పూర్తి స్థాయి బడ్జెట్‌కూ అదే విధానం కొనసాగనున్నట్టు తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.31 వేల కోట్ల కేటాయింపులు లేకపోవడంతో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆ అంశాన్ని చేర్చే అవకాశాలున్నాయి. దీంతో బడ్జెట్ సైజు కొంత పెరిగే చాన్స్ ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

అధిక ప్రయారిటీ

బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రయారిటీ గణనీయంగా ఉండనున్నట్టు సమాచారం. ఆదాయ మార్గాలు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రజల అవసరాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ అంశాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం పలుమార్లు వ్యక్తం చేసింది. ఆర్థిక వనరుల సమీకరణలోని ఇబ్బందుల దృష్ట్యా ఈసారి మౌలిక సౌకర్యాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, కాపిటల్ ఎక్స్ పెండిచర్ తదితరాలకు ఎక్కువగా కేటాయింపులు ఉండకపోవచ్చనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతున్నది.

పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్

పెండింగ్‌ ప్రాజెక్టుల తాజా స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వాటిని పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు కేటాయించే అవకాశమున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో పాటు కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, డిండి, ఎస్సెల్బీసీ తదితర ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు చేయొచ్చని తెలిసింది. భారీ ఖర్చుతో కూడిన ఇరిగేషన్ ప్రాజెక్టుల జోలికి ప్రస్తుతం వెళ్లకుండా తప్పని అవసరాలకు మాత్రమే కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

విద్యారంగంపై స్పెషల్ ఫోకస్

విద్యా మంత్రిత్వశాఖను ఎవ్వరికీ కేటాయించకుండా సీఎం రేవంత్‌రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ రంగానికి అన్యాయం జరిగిందని గతంలో వ్యాఖ్యానించిన సీఎం... ప్రభుత్వ పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దనే నిర్ణయం తీసుకున్నారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యాసంస్థలతో పాటు సెమీ-రెసిడెన్షియల్, అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడంపైనా ఇటీవల కసరత్తు చేశారు. ఇక ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ప్రాసెస్ మొదలైంది. విద్యారంగ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని టీచర్ల రిక్రూట్‌మెంట్ మొదలు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన, స్వయం సహాయక మహిళా బృందాల (అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు)కు బాధ్యతల అప్పగింత.. తదితర నిర్ణయాలు తీసుకున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.21,389 కోట్లను కేటాయించగా ఫుల్ బడ్జెట్‌లో అది ఎంత పెరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

వైద్య రంగంపైనా ప్రత్యేక దృష్టి

కుటుంబ సగటు ఖర్చులో వైద్య అవసరాలకు గణనీయంగా వెచ్చించాల్సి వస్తుందని భావించిన సీఎం రేవంత్... ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రేషను కార్డులతో ముడిపెట్టకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించాలనే విధాన నిర్ణయాన్ని సైతం ప్రకటించారు. వైద్య విధాన పరిషత్‌ సిబ్బందికి ట్రెజరీ ద్వారానే వేతనాలు చెల్లించే విధానంపైనా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు కొత్త మెడికల్ కాలేజీల విషయంలోనూ గత ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగించడంతో పాటు వీలైనంత తొందరగా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ రంగానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.11,500 కోట్లను కేటాయించగా ఈసారి దానిని ఎంతకు పెంచుతారన్నది కీలకంగా మారింది.

సంక్షేమంలో నో కాంప్రమైజ్

సంక్షేమ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్... ఇందిరమ్మ రాజ్యం అంటూ పలుమార్లు వ్యాఖ్యానించింది. ఆరు గ్యారంటీలతోనే ప్రజలు అధికారం ఇచ్చారని పలువురు మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాటిని చిత్తశుద్ధితో ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమం కోసం రూ.53,196 కోట్లను వెచ్చించగా పూర్తి బడ్జెట్‌లో ఇది ఎంత పెరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి. ఓటాన్ అకౌంట్‌లో ఎస్సీ (రూ.21,874 కోట్లు), ఎస్టీ (రూ. 13,013 కోట్లు), బీసీ (రూ. 8,000 కోట్లు), మైనారిటీ (రూ. 2,262 కోట్లు)లకు గణనీయంగ నిధులను కేటాయించిన ప్రభుత్వం ఆ ఒరవడిని పూర్తి బడ్జెట్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలులోకి తెచ్చామని చెబుతున్నందునా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని గ్యారెంటీలను కంప్లీట్ చేస్తామని స్పష్టత ఇచ్చింది. దీనికి తగినట్లుగా బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొన్నది.

వ్యవసాయానికి సైతం..

రాష్ట్రంలోని సగానికి పైగా కుటుంబాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్నాయన్న అంచనాతో రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయడం మొదలుపెట్టింది. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్‌ను ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతులకు రూ.6,098 కోట్లను విడుదల చేశారు. ఈ నెలాఖరుకు రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. పంద్రాగస్టు నాటికి మొత్తం 60 లక్షల రైతు కుటుంబాలకు అప్పుల భారం లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇందుకు అవరసరమైన రూ.31 వేల కోట్లకు సంబంధించిన కేటాయింపులను పూర్తి బడ్జెట్‌లో చేయనున్నారు.

కేంద్ర నిధులనూ వాడుకునే ఆలోచన

సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర పథకాలకు సైతం తగిన మ్యాచింగ్ గ్రాంట్స్ జోడించి ప్రజలకు ఫలాలు అందించాలనుకుంటున్నది. గత ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేకపోయిన ఫసల్ బీమా యోజన, జల్‌జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కొన్ని పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఏయే పథకాల కింద కేంద్రం నుంచి ఎంత వస్తుందో.. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఎంత కేటాయించాలో.. ఇప్పటికే లెక్కలు రెడీ చేసింది. బడ్జెట్‌లో ఈ పథకాల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసే చాన్స్ ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed