Ankara : తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు

by Hajipasha |
Ankara : తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రదాడితో తుర్కియే రాజధాని అంకారా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుర్కియే కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు అంకారా శివారులోని టర్కిష్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (టీయూఎస్ఏఎస్) ప్రధాన కార్యాలయంపై ఈ ఉగ్రదాడి జరిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు తయారు చేసే ఈ కంపెనీపై కొందరు సాయుధ దుండగులు అకస్మాత్తుగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 14 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. టర్కిష్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ వద్ద ఉన్నవారిపై సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఏకంగా టీయూఎస్ఏఎస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈక్రమంలో టీయూఎస్ఏఎస్ భద్రతా సిబ్బంది ప్రతిఘటించారు. దీంతో చాలాసేపు కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులు ఒక శక్తివంతమైన బాంబును పేల్చారు. ఆ వెంటనే పరిసరాలను పొగలు కమ్మేశాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని టీయూఎస్ఏఎస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు.

ఉగ్రవాది సూసైడ్ బాంబుతో..

ఆ వెంటనే టర్కీ భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను మొదలుపెట్టాయి. ఈక్రమంలో ఒక ఉగ్రవాది సూసైడ్ బాంబుతో తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఈ ఉగ్రవాదుల్లో జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించిన ఒక సాయుధ మహిళ కూడా ఉండటం గమనార్హం. ఉగ్రవాదులు వాకీటాకీల్లో మాట్లాడుకుంటూ, పరస్పరం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ దాడిలో పాల్గొనడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీన్నిబట్టి ఈ ఉగ్రవాదులు ఆయుధాలు వాడటంలో, సమన్వయంతో పోరాటం చేయడంలో బాగా ట్రైనింగ్ పొందినట్లు స్పష్టం అవుతోంది.

ఉగ్రవాదుల చెరలో కంపెనీ సిబ్బంది..?

మొత్తం మీద ఈ ఉగ్రదాడి ఘటనలో దాదాపు పదిమంది చనిపోయినట్లు తెలిసింది. 14 మందికి గాయాలవడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈవివరాలను తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా ధ్రువీకరించారు. దీన్ని తమ దేశంపై జరిగిన ఉగ్రదాడిగా అభివర్ణించారు. టీయూఎస్ఏఎస్ కంపెనీ భద్రతా సిబ్బంది విధులు మారుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. టీయూఎస్ఏఎస్ కంపెనీకి చెందిన పలువురు సిబ్బందిని ఉగ్రవాదులు బందీలుగా తమ అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కంపెనీ సమీపంలో పెద్దసంఖ్యలో అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలను మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed