IND VS NZ : పుణెలో సమమా?.. సమర్పణమా?.. నేటి నుంచే రెండో టెస్టు

by Harish |
IND VS NZ : పుణెలో సమమా?.. సమర్పణమా?.. నేటి నుంచే రెండో టెస్టు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి టెస్టులో ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన రోహిత్ సేనకు రెండో టెస్టు కీలకం కానుంది. నేటి నుంచి పుణె వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టులో ఓడిన భారత జట్టు రెండో టెస్టులో పుంజుకోవాలని చూస్తున్నది. పుణె టెస్టులో గెలవడం తప్పనిసరి. లేదంటే సిరీస్ కోల్పోనుంది. మరోవైపు, తొలి టెస్టు విజయంతో జోరు మీద ఉన్న న్యూజిలాండ్ సిరీస్‌పై కన్నేసింది. వరుసగా రెండో టెస్టు గెలవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరి, కివీస్‌ జోరుకు రోహిత్ సేన కళ్లెం వేస్తుందో? లేదంటే వరుసగా రెండో టెస్టులోనూ ఓడి సిరీస్‌ను సమర్పించుకుంటుందో? చూడాలి.

జట్టు కూర్పు తలనొప్పే

రెండో టెస్టుకు తుది జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గంభీర్‌కు తలనొప్పిగా మారింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన గిల్ అందుబాటులోకి రావడం, జట్టులోకి సుందర్‌ను తీసుకోవడంతో జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్టులో గాయపడిన పంత్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. గిల్ రాకతో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఒక్కరికే మాత్రమే తుది జట్టులో చోటుదక్కనుంది. తొలి టెస్టులో సర్ఫరాజ్ శతకంతో రాణించాడు. మరోవైపు, రాహుల్ దారుణంగా నిరాశపరిచాడు. అయితే, రాహుల్‌కు మద్దతు ఇస్తామని హెడ్ కోచ్ గంభీర్ తెలిపాడు. మరి, ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. అలాగే, పుణె పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనున్నట్టు తెలిసింది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. పేస్ దళంలో బుమ్రాకు తోడుగా మరో స్థానం కోసం సిరాజ్, ఆకాశ్ దీప్ పోటీపడుతున్నారు. అలాగే, స్పిన్ కోటాలో అశ్విన్, జడేజాలకు చోటు ఖాయం. మరో స్థానం కోసం కుల్దీప్, సుందర్‌ల మధ్య పోటీ నెలకొంది. బ్యాటింగ్ సామర్థ్యం పెంచుకోవాలంటే సుందర్‌ను, స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవాలంటే కుల్దీప్‌ను ఎంచుకోవచ్చు.

గెలవడం తప్పనిసరి

రెండో టెస్టుకు టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఓడితే భారత్ 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోనుంది. అంతేకాకుండా, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఆడాల్సిన మిగతా ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది.

స్పిన్నర్లదే పిచ్

తొలి టెస్టు ఓటమి తర్వాత రెండో టెస్టు పిచ్‌పై గురించి క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని పిచ్ డ్రైగా ఉంటుంది. ఈ పిచ్ పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రెండో రోజు నుంచి స్పిన్నర్లు మరింత ప్రభావం చూపనున్నారు.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్, యశస్వి జైశ్వాల్, గిల్, కోహ్లీ, పంత్, కేఎల్ రాహుల్/సర్ఫరాజ్ ఖాన్, జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్/ఆకాశ్ దీప్.

న్యూజిలాండ్ : టామ్ లాథమ్, కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫలిప్స్, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విల్ ఒరౌర్కె, అజాజ్ పటేల్.

Advertisement

Next Story

Most Viewed