కవిత లిక్కర్ కేసుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-03-18 07:19:18.0  )
కవిత లిక్కర్ కేసుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి వేల కోట్లు కేటాయించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమంగా తెలంగాణలో బీజేపీకి బలం పెరుగుతోందని అన్నారు. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కొట్టుకుపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 400 లకు పైగా సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని జోస్యం చెప్పారు. వికసిత్ భారత్ కోసం ప్రజలు ఓటు వేయబోతున్నారని అన్నారు.

మే 13న తెలంగాణ ప్రజలు కూడా కొత్త చరిత్ర లిఖించబోతున్నారని తెలిపారు. శక్తి(అధికారం)పై తమ పోరాటం అంటూ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు.. శక్తిని నాశనం చేయాలంటూ విపక్ష కూటమి భావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4వ తేదీన తెలిసిపోతుందని అన్నారు. ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ సమాజం విరోచిత పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాశనం చేశాయని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడిందని తెలిపారు. అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదని విమర్శించారు.

కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీని, మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఎంత కవర్ ఫైర్ చేసినా.. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ATMగా మార్చుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగిందని అన్నారు. కానీ, తమ పాలన అలా లేదని.. బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.

Advertisement

Next Story