అన్ని రంగాలపై ప్రధాని మోడీ మార్క్.. జీ 20 సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Vinod kumar |
అన్ని రంగాలపై ప్రధాని మోడీ మార్క్.. జీ 20 సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీ 20 సదస్సు పై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీ 20 సదస్సు ఎంతో అవసరమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ జీ20 సదస్సులో ఆయన ప్రసంగించారు. జీ 20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచంలో దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. అది ప్రస్తుతం అవసరమని, ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తోందన్నారు. మోడీ దేశ ప్రధాని అయ్యాక ప్రతి రంగంపై దృష్టి సారించారని, అన్ని రంగాలపై మోడీ మార్క్ ఉందన్నారు. జాతీయ రహదారులను ప్రారంభించిన సమయంలో వాజ్ పేయిని అందరూ విమర్శించారని గుర్తుచేశారు. 1993లో అమెరికాలో పర్యటించిన సమయంలో ఇలాంటి రోడ్లు మన దేశానికి వస్తాయా అని తను అనుకున్నట్లు తెలిపారు.

నార్త్ ఈస్ట్‌లోని ప్రతీ రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో రహదారులు, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేస్ లను నిర్మించామన్నారు. ప్రపంచంలో తక్కువ వ్యయంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా తక్కువ రేటుకే 5జీ అందుబాటులో ఉంది భారత్‌లోనేనని తెలిపారు. భారత్‌లో అద్భుతమైన ఫారన్ పాలసీ ఉందన్నారు. పాకిస్థాన్ వాళ్లు చంపేవాళ్ళు.. మనం చచ్చేవాళ్లమనే ఆలోచన గతంలో ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని వివరించారు. పటాన్‌కోట్ ఘటనకు ధీటైన సమాధానం చెప్పగలిగామన్నారు. ఇండియాలో 56 నగరాల్లో 250 జీ 20 సమావేశాలు జరిగేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story