భార్యల ధర్నా.. భర్తల సస్పెన్షన్

by karthikeya |   ( Updated:2024-10-23 04:03:27.0  )
భార్యల ధర్నా.. భర్తల సస్పెన్షన్
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఉన్న 12వ తెలంగాణ రాష్ట్ర బెటాలియన్‌లో పనిచేస్తున్న ఆరుగురు పోలీసులను బెటాలియన్ పోలీసు ఉన్నత అధికారి ఆఫీస్ కమాండింగ్ సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటని అడిగితే.. ‘మీ భార్యలు ధర్నా చేశారు. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం’ అని చెప్పారట. అసలేం జరిగిందంటే బెటాలియన్‌లో పనిచేస్తున్న వందల మంది పోలీసుల భార్యలు వారి భర్తలపై పనిభారం తగ్గించాలని, అర్దర్లి వ్యవస్థను రద్దు చేయాలని, కామన్ మెస్ తీసివేయాలని, రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని, కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరించుకోవాలని బెటాలియన్ కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

దీంతో పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ కారణంగా సీరియస్ అయిన బెటాలియన్ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం ఆరుగురు పోలీసుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అందులో ఒకరు ఆర్డర్ తీసుకోగా.. మిగిలిన ఐదుగురు మాత్రం తమ భార్యలు ధర్నా చేసి నిరసన తెలిపితే తమకు సస్పెన్షన్ అర్దర్లు ఇవ్వడం ఏమిటని అధికారుల నుండి ఆర్డర్ కాపీ తీసుకోలేదట. ఇంత మంది ధర్నా చేస్తే తమపై మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేయడం ఏంటని నిలదీస్తున్నారట. మిగిలిన ఐదుగురిపై కూడా అధికారులు ఒత్తిడి తీసుకొని వచ్చి సస్పెండ్ ఆర్డర్ కాపీలు మంగళవారం రాత్రి వారికి ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ ఆరుగురి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మిగిలిన పోలీసులందరూ మూకుమ్మడిగా పోరాటానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. సస్పెన్షన్‌కి గురి ఆయన పోలీసుల్లో రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, వినోద్ కానిస్టేబుల్, సురేష్ కానిస్టేబుల్, నర్సింగ్ హెడ్ కానిస్టేబుల్, నాగరాజు కానిస్టేబుల్, అష్రఫ్ కానిస్టేబుల్ కు సస్పెన్షన్ ఆర్డర్ కాపీ ఇచ్చారు.

Advertisement

Next Story