కార్డెన్‌ సెర్చ్‌కు మంగళం.. తిష్ట వేస్తున్న అసాంఘిక శక్తులు

by Mahesh |
కార్డెన్‌ సెర్చ్‌కు మంగళం.. తిష్ట వేస్తున్న అసాంఘిక శక్తులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కార్డెన్‌సెర్చ్.. ఈ పదం వింటేనే అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఏ రాత్రి పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తారోనన్న భయం కనిపించేది. పోలీసు ఉన్నతాధికారులు కొంతకాలంగా పక్కన పెట్టేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలో, ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులో సమాచారం ఇచ్చినపుడు మాత్రమే రాష్ట్ర పోలీసులు స్పందిస్తున్నారు. ఇటీవల భోపాల్​యాంటీ టెర్రిరిస్ట్ ​స్క్వాడ్ ​అధికారులు ఇక్కడికి వచ్చి ఉగ్ర కుట్రలకు పాల్పడ్డ ఏడుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్​పాతబస్తీలోని బార్కస్ ​ప్రాంతంలో గతంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించిన పోలీసులు భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుని తో పాటు మరికొందరు పాతనేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు బలగాలను మోహరించి..

కార్డెన్‌సెర్చ్‌ను రెండు నుంచి మూడు వందల మందికి పైగా పోలీసులతో నిర్వహిస్తారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతానికి రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు వెళ్తారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నాకాబందీ చేసి జియో ట్యాగింగ్ ​చేస్తారు. దాంతో అక్కడి నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లటానికి గానీ... ఆ ప్రాంతం లోపలికి రావటానికిగానీ వీలు పడదు. ప్రతి ఇంటికి వెళ్లి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఏవైనా మారణాయుధాలు ఉన్నాయా? పాత నేరస్తులు ఉన్నారా? అన్న విషయాలను పరిశీలిస్తారు. ప్రతి వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్​చేస్తారు. అవి చోరీ చేసినవా? అన్న కోణంలో విచారణ జరుపుతారు.

పక్కా షెడ్యూల్​ ప్రకారం

నాలుగైదేళ్ల క్రితం వరకు ఈ కార్డెన్‌సెర్చ్‌లు పక్కా షెడ్యూల్​ప్రకారం జరిగేవి. ఆయా జోన్ల డీసీపీలు ఏ రోజైతే కార్డెన్‌సెర్చ్‌​జరపాలని నిర్ణయించుకుంటారో ఆ రోజు కొన్ని గంటల ముందు సిబ్బంది అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసేవారు. సమాచారం లీక్​అయ్యే అవకాశం ఉంటుందని ఏ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించబోతున్నామన్న విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. అందరూ సిద్ధమైన తరువాత నిర్ణయించుకున్న ప్రాంతాన్ని అష్ట దిగ్బంధనం చేసి కార్డెన్‌సెర్చ్‌ చేసేవారు. రెండు మూడేళ్లుగా పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్డెన్‌సెర్చ్‌కు మంగళం పాడేశారు. ఒక్క దక్షిణ మండలం పరిధిలో అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్పితే రాష్ట్రంలో ఎక్కడా దీనిని అమలు చేయడం లేదు. దీని పర్యవసానంగా అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed