కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న కాళేశ్వరం.. సర్కారుకు వరుస నోటీసులు

by GSrikanth |   ( Updated:2024-03-29 02:18:41.0  )
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న కాళేశ్వరం.. సర్కారుకు వరుస నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక నిర్వహణ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఎడాపెడా చేసిన అప్పులు తీర్చాలని రుణం ఇచ్చిన సంస్థలు సర్కారుకు నోటీసులు పంపుతున్నాయి. ఒప్పందం ప్రకారం అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి నోటీసులు అందగా తాజాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి వచ్చాయి. ఆర్ఈసీ నుంచి తీసుకున్న రుణాలు నెలవారీగా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. పీఎఫ్‌సీ నుంచి తీసుకున్న రుణాల్లో మూడు పద్దులకు క్వార్టర్లీ పేమెంట్స్ జరగాల్సి ఉండగా మరో రెండింటికి నెలవారీ చెల్లింపులు జరగాల్సి ఉన్నది. అందులో భాగంగానే పీఎఫ్‌సీ నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల పేమెంట్స్‌ నోటీసులు వచ్చాయి.

రూ.1,441 కోట్లు చెల్లించాలని నోటీసులు

కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతేడాది డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను మొత్తం రూ.1,441 కోట్లు ప్రిన్సిపల్ (అసలు) చెల్లించాలని పీఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను ఎన్‌పీఏ (నాన్ పర్‌ఫార్మింగ్ ఎస్సెట్)గా ప్రకటించాల్సి వస్తుందని ఆయన నోటీసు ద్వారా హెచ్చరించారు.

సర్దిచెబుతున్న ఇరిగేషన్ అధికారులు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులకు సర్దిచెప్తున్నారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు సమస్యల్లో కూరుకుపోవడంతో వానాకాలం వచ్చేలోపు దిద్దుబాటు చర్యలకు స్టేట్ గవర్నమెంట్ సిద్ధమవుతున్నది. ఈ పనులకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో బకాయిల చెల్లింపుల తిప్పలు ఆ శాఖకు ఎదురవుతున్నాయి.

గతంలో ఆర్ఈసీ.. నేడు పీఎఫ్‌సీ

బకాయిల చెల్లింపుపై గతంలో ఆర్ఈసీ సైతం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు లేఖలు రాసింది. ఇప్పుడు పీఎఫ్‌సీ సైతం ఉత్తరాలు రాస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న సుమారు రూ.97,449 కోట్ల అప్పులో రూ.68,273 కోట్లు ఈ రెండు సంస్థల నుంచి వచ్చినవే. ఇందులో ఆర్ఈసీ రూ.30,536 కోట్లు సమకూర్చగా, పీఎఫ్‌సీ రూ.37,737 కోట్లు రుణంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పీఎఫ్‌సీ ఐదు పద్దుల కింద రుణం ఇచ్చింది. ఇందులో మూడు క్వార్టర్లీ పేమెంట్ ప్రకారం 2022 అక్టోబర్ నుంచి మొత్తం 48 వాయిదాల్లో 12 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉన్నది. మరో రెండు పద్దుల కింద 144 నెలవారీ వాయిదాల్లో అదే తేదీ నుంచి చెల్లించాల్సి ఉన్నది.

దివాలా తీసిన సంస్థగా ప్రకటించక తప్పదని వార్నింగ్

ఒప్పందం ప్రకారం గత ప్రభుత్వంలోనూ ప్రిన్సిపల్ (అసలు) చెల్లించాలంటూ ఆయా కంపెనీలు లేఖలు రాసినా నిర్దిష్ట గడువులోగా పేమెంట్ జరగలేదు. ఈలోపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బకాయిలు చెల్లించాలంటూ ఇరిగేషన్ డిపార్టుమెంటుకు రెండు కంపెనీలు లేఖలు రాస్తూ ఉన్నాయి. అందులో భాగంగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలకు చెల్లించాల్సిన ఐదు పద్దుల కింద రూ.1,441 కోట్లు చెల్లించాలని, లేని పక్షంలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌ను దివాలా తీసిన సంస్థగా ప్రకటించక తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని పీఎఫ్‌సీ తన తాజా లేఖలో పేర్కొన్నది. ఇప్పటికిప్పుడు చెల్లింపులు చేసే పరిస్థితి లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేమెంట్ చేయడంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోనున్నది.

రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందేమోనని..!

గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి ప్రస్తుత గవర్నమెంట్ జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తున్నదని ఇరిగేషన్ డిపార్ట్‌మెంటుకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం అప్పు చేసినా ఒప్పందం ప్రకారం తీర్చక తప్పదని, కానీ ట్రాన్సిషన్ పీరియడ్‌లో కొన్ని చిక్కులు ఉంటాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు కొన్ని సర్దుబాట్లు తప్పవని ఆ ఆఫీసర్ పేర్కొన్నారు. వాయిదాలు సకాలంలో చెల్లించక పోవడంతో వడ్డీ భారం పెరుగుతుందని, దీన్ని ప్రభుత్వం భరించడం మినహా మరో మార్గం లేదన్నారు. దివాలా సంస్థగా ప్రకటిస్తే కాళేశ్వరం కార్పొరేషన్‌కు భవిష్యత్తులో రుణాలు పుట్టకపోగా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.

Advertisement

Next Story