TG: మావోయిస్టులు తినే భోజనంలో మత్తు మందు.. చిత్రహింసలకు గురిచేసి చంపారని పిటిషన్

by Gantepaka Srikanth |
TG: మావోయిస్టులు తినే భోజనంలో మత్తు మందు.. చిత్రహింసలకు గురిచేసి చంపారని పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం మండ‌లం చెల్పాక వ‌ద్ద ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులంతా ఇల్లందు- న‌ర్సంపేట ఏరియా క‌మిటీ ద‌ళంగా పోలీసులు గుర్తించారు. అయితే ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పౌరహక్కుల సంఘం(Civil Rights Association) లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్(Encounter) చేశారని ఆరోపించారు.

మావోయిస్టులు(Maoists) తినే భోజనంలో మత్తు పదార్థాలు కలిపి కస్టడీలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కస్టడీలో వారిని చిత్ర హింసలకు గురిచేశారని అన్నారు. చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని వెల్లడించారు. డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు చూపించకుండా నేరుగా పోస్టుమార్టానికి తరలించాలని ఆరోపించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు.

అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను ములుగు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారని అన్నారు. దీంతో మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. మృతదేహాలను మావోయిస్టుల కుటుంబాలు, బంధువులకు చూపించాలనీ పేర్కొంది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed